
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్‌లో కేవలం విద్యుదుత్పత్తి కోసం నీటిని వృథా చేయకుండా తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వేసవిలో తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు సాగర్‌పైనే ఆధారపడతాయని గుర్తుచేసింది. విద్యుదుత్పత్తి కోసం విలువైన నీటిని వృథా చేస్తే వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
దిగువన కృష్ణా డెల్టా సాగునీరు, తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపకున్నా తెలంగాణ సర్కార్ నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది.
పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీలకుగానూ ఇప్పటికే 40.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఆగస్టులో నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ సర్కార్ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తిని చేస్తూ దిగువకు నీటిని వదిలేయడంతో పులిచింతలలో నీటి నిల్వను నియంత్రించటానికి అనేక సార్లు గేట్లను ఎత్తాల్సి వచ్చింది. సమాచారం ఇవ్వకుండా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల వరద ఉధృతికి గతేడాది పులిచింతల గేటు కొట్టుకుపోయింది. దాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నాం.
ప్రకాశం బ్యారేజీలోనూ నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. సాగర్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తే.. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి ఆ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉంది.
వేసవిలో తాగునీటి అవసరాలు అధికంగా ఉన్న నేపథ్యంలో.. విలువైన నీటిని నిల్వ ఉంచకుండా.. విద్యుదుత్పత్తి కోసం వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితిని సృష్టించడం న్యాయమా?
Comments
Please login to add a commentAdd a comment