సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన 24 ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. ఇందులో 15 మధ్య, భారీ తరహా ప్రాజెక్టులని, తొమ్మిది చిన్నతరహా ప్రాజెక్టులని వివరించింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఆరింటిని పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందిస్తోందని, మరో రెండు ప్రాజెక్టుల పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నదని ఎత్తి చూపింది. కాగా, మరో ఏడు ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని, ఇంకో తొమ్మిది ప్రాజెక్టులను త్వరలోనే చేపడుతున్నట్లు తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది.
అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తక్షణమే ఆపేసేలా తెలంగాణను ఆదేశించాలని బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్‌లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కు పంపాలని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చాక.. వాటిని అపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టాలని వివరించారు. ఇందుకు విరుద్ధంగా తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించకుండానే.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 24 ప్రాజెక్టులు చేపట్టిందని.. ఇది ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ ప్రాజెక్టులను ఆపేసేలా తెలంగాణను ఆదేశించి.. దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలను పరిరక్షించాలని కృష్ణా బోర్డును కోరారు.
అక్రమ నీటి వినియోగాన్ని అడ్డుకోండి
కృష్ణా నదీ జలాలను చిన్న నీటివనరుల విభాగంలో కేటాయింపుల కంటే అదనంగా 86.39 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటున్న తెలంగాణ సర్కార్‌పై చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. అక్రమంగా నీటిని వాడుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి మంగళవారం లేఖ రాశారు.
► కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లో చిన్న నీటివనరుల విభాగంలో 5,57,104 ఎకరాల ఆయకట్టుకు 89.15 టీఎంసీలను మాత్రమే తెలంగాణకు కేటాయించింది.
► 2014 నుంచి 2021 మధ్య కృష్ణా బేసిన్‌లో 16,163 చెరువులను పునరుద్ధరించడం తోపాటు కొత్తగా 24 చెరువులు, చెక్ డ్యామ్‌లు నిర్మించి తద్వారా చిన్న నీటివనరుల విభాగంలో 10,77,034 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.6,243 కోట్లతో చేపటినట్లు తెలంగాణ సర్కార్ జారీ చేసిన 474 జీవోలో పేర్కొంది. ఈ ఆయకట్టుకు నీళ్లందించడానికి 175.54 టీఎంసీలను తెలంగాణ వాడుకుంటోంది.
► అంటే.. కేటాయించిన నీటి కంటే అదనంగా 86.39 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment