శ్రీశైలంలో ఆగని తెలంగాణ దందా | Krishna waters into the sea over Pulichintala and Prakasam barrage | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో ఆగని తెలంగాణ దందా

Published Sun, Aug 22 2021 2:25 AM | Last Updated on Sun, Aug 22 2021 9:37 AM

Krishna waters into the sea over Pulichintala and Prakasam barrage - Sakshi

సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేయకూడదంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేయకూడదని కేంద్ర జల్‌ శక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తోంది. నీటి సంవత్సరం ప్రారంభం నుంచే (జూన్‌ 1 నుంచి) ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన అటు తెలంగాణ, ఇటు ఏపీకి సంబంధించి తక్షణ సాగు, తాగునీటి అవసరాలు లేవు. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరమూ లేదు. కానీ.. తెలంగాణ సర్కార్‌ అదేమీ పట్టకుండా ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటోంది. దీంతో దిగువకు వదిలేసిన జలాలు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. కొద్దిపాటి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న నీటినంతటినీ గేట్లు ఎత్తేసి దిగువకు వృథాగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా జూన్‌ 1 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 162.76 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం.  
 
వాటా నీటిని దక్కనివ్వకుండా.. 
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 12న వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆ రోజున 884.4 అడుగుల్లో 211.96 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే రోజున సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో 589.5 అడుగుల్లో 311 టీఎంసీల నిల్వ ఉంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 878.40 అడుగుల్లో 180.28 టీఎంసీలకు తగ్గిపోయింది. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాలను వాడుకోనివ్వకుండా చేయడానికే తెలంగాణ సర్కార్‌ కావాల్సిగా విద్యుదుత్పత్తి చేస్తోందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.   
 
సీజన్‌ ప్రారంభం నుంచీ ఇదే తీరు  
► శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే అంటే జూన్‌ 2న 808.5 అడుగుల్లో 33.43 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. ప్రాజెక్టు ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు.  
► కానీ.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే దిగువన ఎలాంటి సాగు, తాగునీటి అవసరాలు లేకపోయినా జూన్‌ 2న తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. తెలంగాణ సర్కార్‌ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 
► ‘శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటిని తరలించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు.. చెన్నైకి తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కార్‌ తీరుతో ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగుల కంటే తగ్గిపోతే, కేటాయింపులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు నీటిని అందించలేము’ అని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు స్పష్టంగా వివరించింది. 
► దీంతో తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డులు ఆదేశించాయి. అయినా సరే.. తెలంగాణ సర్కార్‌ ఖాతరు చేయకుండా రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది.  
► ఈ పరిస్థితిలో న్యాయ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈనెల 27న జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement