సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి ఆపరేషన్, ప్రొటోకాల్ అంశాలపై అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగిన కృష్ణా బోర్డు సబ్ కమిటీ దీనిపై ప్రాథమిక దశలోనే చేతులెత్తేసింది. కేంద్ర జల సంఘం ఇంజనీర్లతో కలిసి తయారు చేసిన ముసాయిదా నివేదికపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో దానిపై వెనక్కి తగ్గింది. దీంతో పూర్తిస్థాయి బోర్డు భేటీలోనే ఈ అంశాన్ని తేల్చుదామంటూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖల ద్వారా సమాచారమిచ్చింది. కృష్ణా స్పెషల్ బోర్డు భేటీలో చేసిన నిర్ణ యం మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, సభ్యుడు రవికుమార్ పిళ్లైల నేతృత్వం లో సబ్ కమిటీ ఏర్పాటయ్యింది.
ఈ కమిటీ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్‌పై అధ్యయనం చేసేందుకు గత నెల 25, 26 తేదీల్లో శ్రీశైలం పరిధిలో పర్యటించింది. అనంతరం ఒక ముసాయిదా నివేదికను రూపొందించి రాష్ట్రాల పరిశీలనకు అందజేసింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల కనీస నీటి మట్టం వరకు విద్యుత్ అవసరాలకు నీటిని వినియోగించుకోవచ్చని, 854 అడుగుల మట్టంలో నీరున్నప్పుడు తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకోచ్చని పేర్కొంది.
బచావత్ అవార్డుకు విరుద్ధం: తెలంగాణ
ఈ ముసాయిదాపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కమిటీ మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగంపై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ పేర్కొన్న నేపథ్యంలో ఆ విధానాన్నే అమ లుచేయాలని డిమాండ్ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అని పేర్కొన్నారని, కరెంట్ ఉత్పత్తి మినహా శ్రీశైలం నుంచి మరో ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఆస్కారమే లేదని ఇటీవల లేఖలో స్పష్టం చేసింది.
బోర్డుకు గానీ, కేంద్రానికి గాని బచావత్ అవార్డులో ని నిబంధనలను పునర్నిర్వచించే అధికారం లేదని తేల్చిచెప్పింది. దీంతో సబ్ కమిటీ వెనక్కి తగ్గింది. ఆయా అంశాలపై పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చ జరగాలని, అక్కడి అభిప్రాయం మేరకే నడుచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మేరకు బోర్డుతెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment