సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టులో భాగంగా.. 2018లో బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే రూ.750 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ పేర్కొంది. భూసేకరణ, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్డ్ చానళ్లు, కరకట్టలు, పంపుహౌజ్‌లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులతోపాటు 18 శాతం జీఎస్టీ పన్నును కలిపితే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,550.73 కోట్లకు చేరిందని తెలిపింది.
కేవలం జీఎస్టీ పన్ను వ్యయం రూ.622.40 కోట్లు కానుందని వెల్లడించింది. ‘వార్ధా ప్రాజెక్టు..భారీ బడ్జెట్’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగలేదని పేర్కొన్నారు.
తుమ్మిడిహెట్టితో భారం
తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధా నదిపై బ్యారేజీని నిర్మించనుండటంతో వ్యయం గణనీయంగా తగ్గుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పొడవు 6.45 కిలోమీటర్లు, గేట్ల సంఖ్య 102కాగా.. వార్ధా బ్యారేజీ పొడవు 1751 మీటర్లు, గేట్ల సంఖ్య 29కి తగ్గుతాయని వివరించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీలో 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద గరిష్ట నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలు మాత్రమేకాగా.. వార్ధా బ్యారేజీలో 155 మీటర్ల వద్ద 2.94 టీఎంసీలను నిల్వ చేయవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment