సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తీవ్ర అభ్యంతరాలతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరత, భవిష్యత్తు మనుగడపై కాగ్ తీవ్ర సందేహాలను వ్యక్తం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం ద్వారా అనవసర భారం పడినట్లు ఆక్షేపించినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టుపై రెండేళ్లపాటు సుదీర్ఘ ఆడిట్ నిర్వహించిన తర్వాత కాగ్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను రూపొందించింది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలపి చెల్లింపులకు ఏటా రూ. 13 వేల కోట్లు, ప్రాజెక్టు విద్యుత్ చార్జీలకు ఏటా మరో రూ. 12 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు రూ. 270 కోట్లు కలిపి ఏటా సుమారు రూ. 25 వేల కోట్ల వ్యయం కానుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకరం ఆయకట్టు సాగుకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం రూ. 6.4 లక్షలు కానుందని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది.
ప్రాజెక్టు 12 శాతమే పూర్తి...
కాళేశ్వరం ప్రాజెక్టులోని 56 పనుల్లో ఇప్పటివరకు 12 మాత్రమే పూర్తయ్యాయని, మరో 40 పనులు 3 శాతం నుంచి 99 శాతం వరకు, మిగిలిన 4 పనులు ఇంకా ప్రారంభం కాలేదని నివేదికలో కాగ్ వివరించినట్లు తెలిసింది. ప్రాజెక్టు భూసేకరణ కోసం 98,110 ఎకరాలకుగాను 63,972 ఎకరాలనే సేకరించారని తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన అప్పుల్లో రూ. 1,700 కోట్లను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు ఆరోపించింది.
ఉన్నతాధికారుల భేటీ...
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మేరకు కాగ్ తీవ్ర సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర నీటిపారు దల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కాగ్ ని వేదికపై బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు చర్చించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణలను తీసుకున్నాక తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
రుణాలు, వడ్డీల భారం..
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిపి 15 భారీ రుణాల రూపంలో మొత్తం రూ. 97,449 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంది. వార్షిక వడ్డీ రేట్లు 8.25 శాతం నుంచి 10.9 శాతం వరకు ఉన్నాయి. 2023–24 నుంచి 2034–35 మధ్యకాలంలో ఏటా రూ. 13 వేల కోట్లను వడ్డీలతో సహా రుణాల తిరిగి చెల్లింపుల కోసం కట్టాల్సి ఉండనుంది.
ఇప్పటివరకు పొందిన రుణాల తిరిగి చెల్లింపులు 2039–40 వరకు కొనసాగనున్నాయి. దీని నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 85 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ. 1.50 లక్షల కోట్లకు ఎగబాకనుందని కాగ్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కింద ఎకరా ఆయకట్టు సాగుకు రూ. లక్ష వరకు కరెంట్ బిల్లు కానుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment