సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన కొడుకుగా ప్రాజెక్టును నేనే పూర్తి చేసి తీరుతా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాలే అందుకు తార్కాణమన్నారు. బుధవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 2014 – 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేశామని చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేశారని.. వాస్తవంగా ఆయన హయాంలో జరిగింది కేవలం 20 శాతం పనులేనని ఎత్తిచూపారు. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తూ.. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని పునరుద్ఘాటించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
పోలవరం ప్రాజెక్టు ఒక కల
– స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. ఏ సీఎం ఈ కలను సాకారం చేయాలని అనుకోలేదు. 2004లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టును సాకరం చేస్తూ పనులను పరుగులెత్తించారు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కోసం 10,627 ఎకరాలు (86 శాతం) సేకరించారు. కుడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
– 2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక కుడి ప్రధాన కాలువలో సేకరించిన భూమి కేవలం 1,700 ఎకరాలు మాత్రమే. కేవలం 14 శాతం. నిజానికి 2005లో భూసేకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
– ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం వైఎస్ హయాంలో 10,342 ఎకరాలు (98 శాతం) భూసేకరణ జరగ్గా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు (0.89 శాతం) మాత్రమే సేకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చారు. వైఎస్సార్ కుడి ప్రధాన కాలువను పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలతో నీటిని ఎలా తరలించే వారు? ఎక్కడికి తీసుకుపోగలిగేవారు?
అప్పుడెందుకు నోరు పెగల్లేదు బాబూ?
– 2016 సెప్టెంబరు 7న అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ఢిల్లీలో మీటింగ్ పెట్టి స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు ఆయన పక్కనే టీడీపీ మంత్రి సుజానాచౌదరి, ఎంపీ సీఎం రమేష్, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు.
– అదే రాత్రి చంద్రబాబు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి.. అరుణ్‌జైట్లీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
– 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఒక మెమొరాండంను కేంద్ర జల శక్తి శాఖకు పంపించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని అందులో స్పష్టంగా ఉంది. అయినా అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అదే సమయంలో ఇక్కడ అసెంబ్లీలో నేను ఆ విషయాన్ని ఆ రోజు ప్రస్తావించాను. (ఆ రోజు ఏం మాట్లాడింది వీడియో చూపారు.)
– 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన దాని ప్రకారం పోలవం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు మాత్రమే వస్తుందని తెలిసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన ఖర్చు రూ.5,500 కోట్లు ఇవ్వం అని, పవర్ హౌస్, తాగునీటి సరఫరా వ్యయం రూ.2,800 కోట్లు ఇవ్వలేమని, కేవలం నీటి పారుదల విభాగం వ్యయం రూ.7,500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు?
– అసలు ఈ మనిషికి ఇంగ్లిష్ వస్తుందా? రాదా? అన్నది అర్థం కావడం లేదు. ఏ ప్రాజెక్టు పనుల్లో అయినా ధరలు ఒకే విధంగా ఉండవు. ఇదే అంశాన్ని నేను శాసనసభలో లేవనెత్తి, నిలదీసే ప్రయత్నం చేస్తే అప్పటి స్పీకర్ మా గొంతు నొక్కారు. అప్పుడే చంద్రబాబు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం జగన్
ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.37,883 కోట్లు అవసరం
– ఇలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తున్నాం. అన్యాయమైన పరిస్థితులను మారుస్తూ వస్తున్నాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.26,585 కోట్లు కావాలి. ఇతర సివిల్ పనులకు రూ.7,174 కోట్లు, పవర్ ప్రాజెక్టుకు మరో రూ.4,124 కోట్లు కావాలి. ఆ విధంగా మొత్తం రూ.37,883 కోట్లు కావాలి.
– పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఒకటికి రెండు సార్లు జల శక్తి మంత్రి, ఆర్థిక మంత్రులను కలిశాం. వాస్తవ పరిస్థితులను వివరించాం. చివరకు వారు 2013–14 ధరలతో ప్రాజెక్టు పూర్తి కాదని అంగీకరించారు. కేంద్రం కూడా దేవుడి దయతో సానుకూలంగా స్పందిస్తోంది. అందుకు కేంద్రానికి కృతజ్ఞతలు.
– ఇంటి పెద్దగా చెబుతున్నాను. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదు. మొత్తం 45.72 మీటర్లు కడతాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా ఎక్కడా ఆపం. సీడబ్ల్యూసీ ప్రొటోకాల్ ప్రకారమే నీరు నిల్వ చేస్తాం.
– తెలుగు జాతి ప్రజల కోరిక మేరకు.. మన ఎమ్మెల్యేల తీర్మానం మేరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు వద్ద ప్రతిష్టిస్తాం.
– ప్రాజెక్టు పనుల్లో ఒక్క పైసా కూడా మేం వృథా చేయడం లేదు. గత ప్రభుత్వం బస్సులు పెట్టి, ప్రజలు సందర్శించినట్లు రాసుకుంటూ ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేసింది. (ప్రజలను తీసుకుపోయి జయము..జయము చంద్రన్నా అంటూ చిడతలతో మహిళలు పాడిన పాటల వీడియో ప్రదర్శించారు. ఈ పాట వస్తున్నంత సేపూ సభలో సభ్యులంతా విరగబడి నవ్వారు.)
రివర్స్ టెండరింగ్‌లో ఆదా ఇలా..
కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్లను రద్దు చేసి.. యాపిల్ టు యాపిల్ పద్ధతిలో తొలుత రివర్స్ టెండర్లు పిలిస్తే రూ.1,142 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా రూ.1,343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జయము.. జయము చంద్రన్నకు రూ.83 కోట్లు
‘పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిం ది.. రండి.. రండి.. చూసొద్దురు కానీ.. మేమే తీసుకెళ్తాం.. తీసుకొస్తాం.. మంచి భోజనం పెడతాం..’ అంటూ గత ప్రభుత్వ హయాంలో బస్సులు పెట్టి, జనాన్ని తరలించిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే.. ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుంది వ్యవహారం. పునాదుల్లో ఉన్న ప్రాజెక్టును చూపించి, కీర్తనలు పాడించుకుని తరించిపోయారు అప్పటి (అ)ధర్మ ప్రభువులు. ఇలాంటి సీన్ల కోసం రూ.లక్ష కాదు.. రూ.కోటి కాదు.. ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేశారు. అలా ప్రాజెక్టు వద్దకు తరలించి ‘జయము.. జయము చంద్రన్నా.. అంటూ మహిళలు పాడుతూ భజన చేస్తున్న ఓ పాటకు సంబంధించిన వీడియోను బుధవారం అసెంబ్లీలో ప్రదర్శించినప్పుడు సభ్యులు పొట్ట చెక్కలయ్యేట్లు విరగబడి నవ్వడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment