సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన కొడుకుగా ప్రాజెక్టును నేనే పూర్తి చేసి తీరుతా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాలే అందుకు తార్కాణమన్నారు. బుధవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 2014 - 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేశామని చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేశారని.. వాస్తవంగా ఆయన హయాంలో జరిగింది కేవలం 20 శాతం పనులేనని సీఎం ఎత్తిచూపారు. పునాది స్థాయి దాటని పోలవరం ప్రాజెక్టు పనులను చూపేందుకు బస్సులో జనాలను పంపారని.. రవాణా ఖర్చులు, భోజనం ఖర్చుల కింద రూ.83.45 కోట్లను టీడీపీ నేతలే మింగేశారన్నారు. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తూ.. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని పునరుద్ఘాటించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
పోలవరం ప్రాజెక్టు ఒక కల
► స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. గతంలో ఎందరో సీఎంలు అయ్యారు. ఏ ఒక్కరూ ఈ కలను సాకారం చేయాలని అనుకోలేదు. ఇదే చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నారు. కేంద్రంలో కూడా చక్రం తిప్పానని చెప్పుకున్నారు.
► కానీ ఏనాడూ పోలవరం గురించి పట్టించుకోలేదు. ఎగువన కర్ణాటకలో అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా, ప్రాజెక్టులు కడుతున్నా ఏనాడూ పట్టించుకోలేదు.
కలను సాకారం చేసిన మహానేత
► చంద్రబాబు దిగిపోయిన తర్వాత 2004లో ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే దశాబ్దాల కల అయిన పోలవరం ప్రాజెక్టును సాకరం చేస్తూ పనులను పరుగులెత్తించారు. వైఎస్ హయాంలోనే పోలవరం కుడి ప్రధాన కాలువ కోసం 10,627 ఎకరాలు (86 శాతం) సేకరించారు. కుడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
► 2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక కుడి ప్రధాన కాలువలో సేకరించిన భూమి కేవలం 1,700 ఎకరాలు మాత్రమే. కేవలం 14 శాతం. నిజానికి 2005లో భూసేకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
► ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం వైఎస్ హయాంలో 10,342 ఎకరాలు (98 శాతం) భూసేకరణ జరగ్గా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు (0.89 శాతం) మాత్రమే సేకరించారు. వీటిని పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరు చిత్తశుద్ధితో పని చేశారన్నది తెలుస్తుంది.
(చదవండి: అసెంబ్లీలో ‘చంద్రన్న భజన’.. పడి పడి నవ్విన సీఎం జగన్)
అన్ని అనుమతులూ వైఎస్ హయాంలోనే
► వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చారు.
► 2005 సెప్టెంబర్‌లో ఎంఓఈఎఫ్ నుంచి సైట్ క్లియరెన్స్.
► 2005 అక్టోబర్‌లో ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్.
► 2006 జూలైలో నేషనల్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి వైల్డ్ లైఫ్ క్లియరెన్స్.
► 2007 మే లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫెయిర్స్ నుంచి ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్.
► 2008 సెప్టెంబర్‌లో పర్మిషన్ ఫర్ డైవర్షన్ ఆఫ్ ఆర్‌ఎఫ్ ల్యాండ్ పర్‌టెయినింగ్ ఆఫ్ పాపికొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ.
► 2008 డిసెంబర్‌లో ఎంఓఈఎఫ్ నుంచి ఫారెస్టు క్లియరెన్స్ స్టేజ్-1
► 2009 జనవరిలో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి టీఏసీ క్లియరెన్స్.
► 2009 ఫిబ్రవరిలో ప్లానింగ్ కమిషన్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్.
► 2009 మార్చిలో ఈఏసీ క్లియరెన్స్.
► 2010 జూలైలో ఫారెస్టు క్లియరెన్స్ స్టేజ్-2
► ఈ అనుమతులన్నీ రావడానికి 4 ఏళ్లు పట్టింది. 2005లో దరఖాస్తు చేస్తే, తొలి ఫారెస్టు క్లియరెన్స్ డిసెంబర్ 2008లో వచ్చింది. సెకండ్ స్టేజ్ క్లియరెన్సు జూలై 2010లో వచ్చింది. 2010-11 ధరల ప్రకారం మొదటి సారి సవరించిన అంచనా వ్యయానికి సాంకేతిక సలహా మండలి(టీఏసీ) క్లియరెన్సు జనవరి 2011లో వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా చిత్తశుద్ధితో భూసేకరణతో పాటు, పనులు కూడా చేశారు.
ఎవరో పనులు చేపడితే...
► ఎవరో పనులు చేసి పెడితే, ఆ క్రెడిట్ తీసుకునే కార్యక్రమంలో ఎంత గొప్పగా చంద్రబాబు ఉంటారు అనడానికి నిదర్శనమే పట్టిసీమ.
► వైఎస్ రాజశేఖరరెడ్డి కుడి ప్రధాన కాలువను పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలతో నీటిని ఎలా తరలించే వారు? ఎక్కడికి తీసుకుపోగలిగేవారు?
చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే
► 2014 జూన్ వరకు జరిగిన పోలవరం హెడ్ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి చూస్తే 20.61 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తమ్మీద(ఓవరాల్‌గా) భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కూడా కలుపుకుని మొత్తం ప్రాజెక్టు పనులను చూస్తే 9.29 శాతం పూర్తయ్యాయి.
► 2014 జూన్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, చంద్రబాబు హయాంలో అయిన పనులు హెడ్ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి చూస్తే 39.53 శాతం పనులు, ప్రాజెక్టులో ఓవరాల్‌గా 20 శాతం పనులు మాత్రమే జరిగాయి. అది కూడా రూ.55 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం పరంగా చూస్తేనే.
► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్‌గా 29.80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. హెడ్ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి, అంతకు ముందు జరిగిన పనులు కూడా కలుపుకుని చూస్తే 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు నోరు తెరిస్తే ప్రాజెక్టులో 70 శాతం పూర్తి చేశామని పదే పదే అవాస్తవాలు వల్లె వేస్తున్నారు.
► ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పనులన్నీ మేము పూర్తి చేస్తున్నాం. ఆ దివంగత నేత కొడుకు పూర్తి చేస్తున్నాడని గర్వంగా చెబుతున్నా.
రివర్స్ టెండరింగ్‌లో రూ.1,343 కోట్లు ఆదా
► పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబు అక్రమాలను ఏకరవు పెట్టారు.
► కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ చేస్తే అక్షరాలా రూ.1,343 కోట్లు ఆదా అయ్యాయి. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఇట్టే తెలుస్తోంది.
► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్లను రద్దు చేసి.. యాపిల్ టు యాపిల్ పద్ధతిలో తొలుత రివర్స్ టెండర్లు పిలిస్తే రూ.1,142 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ తర్వాత చేపట్టిన పనుల్లో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా రూ.1343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో ఎక్కడ తప్పు జరిగిందంటే..
► 2016 సెప్టెంబరు 7న స్పెషల్ ప్యాకేజీ ఇచ్చారు. అరుణ్‌జైట్లీ ఆ అర్ధరాత్రి ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన పక్కనే టీడీపీ మంత్రి సుజానాచౌదరి, ఎంపీ సీఎం రమేష్, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు.
► అదే రాత్రి చంద్రబాబు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి.. అరుణ్‌జైట్లీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం అన్నీ మనకు గుర్తున్నాయి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, స్పెషల్ ప్యాకేజీ అంటూ డ్రామాలు చేయడం చూశాం.
► ఆ తర్వాత మర్నాడు సెప్టెంబరు 8న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. (సీఎం ప్రెస్ నోట్‌ను సభలో ప్రదర్శించి చూపి.. అందులో ముఖ్యాంశాలను చదివి వినిపించారు)
► 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే వంద శాతం భర్తిస్తామని ఆ నోట్‌లో స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది కాబట్టి.. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
► అయితే ఇంగ్లిష్‌లో ఉన్న ఆ నోట్ చంద్రబాబుకు ఏం అర్ధం అయిందో కాలేదో ఎవరికీ తెలియదు. కానీ అరుణ్‌జైట్లీకి శాలువా కప్పి సత్కరించి వచ్చారు. మామూలుగా నేతలు రాష్ట్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమని అడుగుతారు. కానీ చంద్రబాబు మాత్రం జాతీయ స్థాయి ప్రాజెక్టును రాష్ట్ర స్థాయికి దిగజార్చడానికి ఎక్కువ ఆరాటపడ్డారు.
అప్పుడెందుకు నోరు పెగల్లేదు బాబూ?
► 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఒక మెమొరాండంను కేంద్ర జల శక్తి శాఖకు పంపించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని అందులో స్పష్టంగా ఉంది.
► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో టీడీపీకి చెందిన అశోక గజపతి రాజు, సుజనా చౌదరి ఉన్నారు. ఆ మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. అందులోనూ.. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని స్పష్టం చేసింది.
► పోలవరం ప్రాజెక్టుకు ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు అప్పుడు ఎందుకు స్పందించలేదు? అదే సమయంలో ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో అసెంబ్లీలో నేను ఆ విషయాన్ని ఆ రోజు సభలో ప్రస్తావించాను. (ఆ రోజు ఏం మాట్లాడింది సీఎం వివరించారు. వీడియో కూడా చూపారు.)
► 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన దాని ప్రకారం పోలవం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు మాత్రమే వస్తుందని తెలిసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన ఖర్చు రూ.5,500 కోట్లు ఇవ్వం అని, పవర్ హౌస్, తాగునీటి సరఫరా వ్యయం రూ.2,800 కోట్లు ఇవ్వలేమని, కేవలం నీటి పారుదల విభాగం వ్యయం రూ.7,500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు?
► ఇదే అంశాన్ని నేను శాసనసభలో లేవనెత్తి, నిలదీసే ప్రయత్నం చేస్తే అప్పటి స్పీకర్ మా గొంతు నొక్కారు. అప్పుడే చంద్రబాబు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
► 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అందులో (లేఖను చదివి వినిపించారు) 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే వంద శాతం భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. అప్పుడు కూడా టీడీపీ.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు స్పందించలేదు.
చంద్రబాబుకూ ఇంగ్లిష్ వస్తుందా? రాదా?
► 2018 జనవరి 12న చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. (ఆ లేఖను చదివి వినిపించారు) ఆ లేఖలో 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటి ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్ర జల సంఘానికి పంపామని.. దయచేసి మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఆ ప్రతిపాదలను ఆమోదించాలని ప్రధానిని చంద్రబాబు కోరారు.
► అసలు ఈ మనిషికి ఇంగ్లిష్ వస్తుందా? రాదా? అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏ ప్రాజెక్టు పనుల్లో అయినా ధరలు ఒకే విధంగా ఉండవు. అదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టును కేవలం కొన్ని వందల కోట్లతోనే పూర్తి చేసి ఉండేవాళ్లం ఆ రోజుల్లో.
► ఎందుకంటే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ - 2013 చట్టం ప్రకారం, ఆ రెండింటిని ఏ రోజుకు ఆరోజే (ప్రాజెక్టు ఎప్పుడు చేపడితే అప్పుడు) లెక్కించాలి. ఏ ధర ఖరారు చేసినా, అది కేవలం ఒక ఏడాది వరకు మాత్రమే. ఆ తర్వాత భూసేకరణకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలి.
► జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మూడేళ్లకు ఒకసారి సవరించాలి. మరి అలాంటి పరిస్థితుల్లో.. 2014 ఏప్రిల్ 1 నాటి వ్యయానికి చంద్రబాబు ఏ రకంగా ఒప్పుకున్నారు? ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించ లేదు? అన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.37,883 కోట్లు అవసరం
► ఇలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తున్నాం. అన్యాయమైన పరిస్థితులను మారుస్తూ వస్తున్నాం.
► పోలవరం ప్రాజెక్టును ఇవాళ పూర్తి చేయాలంటే ఒట్టి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.26,585 కోట్లు కావాలి. ఇతర సివిల్ పనులకు రూ.7,174 కోట్లు, పవర్ ప్రాజెక్టుకు మరో రూ.4,124 కోట్లు కావాలి. ఆ విధంగా మొత్తం రూ.37,883 కోట్లు కావాలి. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.55,500 కోట్లకు పైనే కాగా, ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.17,665 కోట్లు. కాబట్టి ఇంకా కావాల్సిన నిధులు రూ.37,883 కోట్లు.
► 2013-14 రేట్ల ప్రకారం చూస్తే రూ.30,610 కోట్లు. ఇందులో ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.17 వేల కోట్లు తీసివేస్తే.. మిగిలేది మరో రూ.13 వేల కోట్లు. ఒక్క భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కే రూ.26,585 కావాలి. మరి ఏ రకంగా ప్రాజెక్టు పూర్తవుతుంది? అది పూర్తిగా రాంగ్ పద్ధతి.
సానుకూలంగా స్పందిస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు
► పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఒకటికి రెండు సార్లు జల శక్తి మంత్రి, ఆర్థిక మంత్రులను కలిశాం. మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాలుగుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మను కలిశారు.
► జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. నేను స్వయంగా వెళ్లి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి.. వాస్తవ పరిస్థితులను వివరించాను.
► కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖ అధికారులకు రాష్ట్ర జల వనరులు, ఆర్థిక శాఖ అధికారులు చాలా సార్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో చివరకు వారు కూడా ఒప్పుకున్నారు. 2013-14 ధరలతో ప్రాజెక్టు పూర్తి కాదని అంగీకరించారు. అందులో తొలుత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేయించాం.
► ఇప్పటికే పీపీఏ పాజిటివ్‌గా స్పందించింది. పీపీఏకి సంబంధించింది కేంద్ర జల్ శక్తి శాఖ కాబట్టి.. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. ఆ శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని పూర్తిగా క్లీన్ చేస్తూ, అందరితో మాట్లాడి పరిష్కారాలు వెతుకుతున్నాం. కేంద్రం కూడా దేవుడి దయతో సానుకూలంగా స్పందిస్తోంది. అందుకు కేంద్రానికి కృతజ్ఞతలు.
ఒక్క అంగుళం కూడా తగ్గదు
ఇంటి పెద్దగా చెబుతున్నాను. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదు. మొత్తం 45.72 మీటర్లు కడతాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకును. ఆయన ఊహించినట్లు కడతాం. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకువస్తాం. ఈ ప్రాజెక్టు కచ్చితంగా పూర్తవుతుంది.
నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్లే
► మా నియోజకవర్గంలో చిత్రావతి ప్రాజెక్టు ఉంది. దాని సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ ఏనాడూ 3 టీఎంసీలకు మించి నింపలేదు. కారణం రూ.240 కోట్లు.. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ నిధులు ఇవ్వలేదు. అదే విధంగా పులిచింతల, కండలేరు, గండికోట, వెలిగొండ కూడా. ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోతే నీళ్లు ఎలా నింపుతాం? మేము అధికారంలోకి రాగానే చిత్రావతి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చాం.10 టీఎంసీలు నింపాం.
► గండికోట ప్రాజెక్టు ప్రాజెక్టు సామర్థ్యం 27 టీఎంసీలు. కానీ.. గత ప్రభుత్వం 13 టీఎంసీలకు మించి నిల్వ చేయలేదు. ఎందుకంటే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం నిధులు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక ఆర్ అండ్‌కు రూ.600 కోట్లు ఇచ్చాం. ఈ రోజు అందులో 19 టీఎంసీలు నిల్వ చేశాం. ఇంకా ఎక్కువ నీటిని నిల్వ చేయవచ్చు. కానీ నిర్వాసితులు కాస్త సమయం కోరుతున్నారు. కండలేరు ప్రాజెక్టులో ఆర్ అండ్ ఆర్‌కు రూ.50 కోట్లు ఇవ్వకపోవడం వల్ల సామర్థ్యం కంటే 10 టీఎంసీలు తక్కువగా నిల్వ చేశారు.
యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులు
► పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళం కూడా తగ్గదు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా ఎక్కడా ఆపం. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేయాలంటే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.3,383 కోట్లు కావాలి. ఆ స్థాయిలో 120 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు.
► ఆ తర్వాత 44 మీటర్ల ఎత్తు వరకు పోవడానికి మరో రూ.2 వేల కోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం ఖర్చు చేస్తే 158.39 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. 45 మీటర్లకు పెంచితే మరో రూ.4,500 కోట్లు ఖర్చు చేయాలి. అలా పెంచితే 180 టీఎంసీల వరకు నీరు నిల్వ చేయొచ్చు.
► దాని తర్వాత ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంటే 45.72 మీటర్లలో 194 టీఎంసీల నిల్వ చేయాలంటే రూ.13,699 కోట్లు ఆర్ అండ్ ఆర్ కోసం, భూసేకరణకు మరో రూ.3 వేల కోట్లు కావాలి. అంటే రూ.16 వేల కోట్లు అవుతాయి.
సీడబ్ల్యూసీ ప్రొటోకాల్ ప్రకారమే నీటి నిల్వ
► జలాశయాల్లో నీటిని నిల్వ చేయడానికి సీడబ్ల్యూసీ డ్యామ్ సేఫ్టీ అండ్ స్టేబులిటీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టు కట్టగానే పూర్తి స్థాయిలో నీరు నింపరు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు ఒకసారి చూస్తే.. డ్యామ్ కట్టిన తర్వాత మొదటి ఏడాది 33 శాతం,, రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీరు నింపాలి. ఏ డ్యామ్‌కు అయినా అవే నిబంధనలు వర్తిస్తాయి.
► ఇక్కడ మనం 41.5 మీటర్ల వరకు నిల్వకు వెళ్తాం. అంటే దాదాపు 120 టీఎంసీలు నిల్వ చేస్తాం. ఆ తర్వాత సీడబ్ల్యూసీ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాం.
► పోలవరం డ్యామ్, రిజర్వాయర్ కెపాసిటీ ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించడం లేదు. అదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాం. ఎందుకంటే రేపు ఎల్లో మీడియా, చంద్రబాబు ఏమైనా చెప్పగలుగుతారు. నిందిస్తారు. అందుకే అంత వివరంగా చెబుతున్నాం.
వంద అడుగులతో వైఎస్సార్ విగ్రహం
► తెలుగు జాతి ప్రజల కోరిక మేరకు.. మన ఎమ్మెల్యేల తీర్మానం మేరకు దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టును సాకారం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు వద్ద ప్రతిష్టిస్తాం. ప్రాజెక్టు పనుల్లో ఒక్క పైసా కూడా మేం వృథా చేయడం లేదు.
► పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఏ విధంగా వృథా వ్యయం చేసిందో చూద్దాం. బస్సులు పెట్టి, ప్రజలు సందర్శించినట్లు రాసుకుంటూ ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. అందులో భోజనం బిల్లులు ఏకంగా రూ.14 కోట్లు. అంత జనం వచ్చిందీ లేదు. చూసిందీ లేదు. అయినా అడ్డగోలుగా లెక్కలు రాసి దోచుకున్నారు. అసలు ప్రాజెక్టు పనులు కూడా కాలేదు.
► డయాఫ్రమ్ వాల్. అంటే కేవలం పునాది పనులు. కాంక్రీట్ వేసే పేరుతో.. గేట్లు పెడుతున్నామనే పేరుతో చంద్రబాబు ఏకంగా మూడు సార్లు శంకుస్థాపన చేసి డ్రామా చేశారు. అలా హంగామా చేసిన దానికి రూ.83.45 కోట్లు ఖర్చు చేశారు. (ప్రజలను తీసుకుపోయి ఏం చేశారో చూద్దాం.. అంటూ నాడు చంద్రబాబును పొగుడుతూ జయము..జయము చంద్రన్నా అంటూ చిడతలతో మహిళలు పాడిన పాటల వీడియో ప్రదర్శించి చూపారు. ఈ పాట వస్తున్నంత సేపూ సభలో సభ్యులంతా విరగబడి నవ్వారు.)
Comments
Please login to add a commentAdd a comment