సాక్షి, తాడేపల్లి : రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని ఆయన వెల్లడించారు. ఇక ఏటా వందలకొద్దీ టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో గోదావరి నదీ జలాలను సాధ్యమైనంతగా వినియోగించుకోవాలని ఆయన జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. జల వనరులశాఖ పనితీరుపై సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ నెల ఆరో తేదీన మరోసారి జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. సుదీర్ఘంగా సాగిన జలవనరులశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల శాఖలో ఎట్టిపరిస్థితుల్లో అవినీతికి తావు ఉండకూడదని, ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో తదుపరి సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి కే ధనంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు.. పనుల పురోగతితోపాటు కీలక ప్రాజెక్టుల వద్ద జరుగుతున్న పనుల తీరును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది? రాష్ట్రంలోని తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసి.. వీలైనంతగా తొందరగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమీక్షలో చర్చించినట్టు తెలుస్తోంది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment