సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల్లో వాటాల పంపకాలపై ఈ నెల 10న జరిగే కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం ఎజెండా ఖరారైంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణాజలాల్లో చెరి ఏభై శాతం చొప్పున నీటిపంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి.
2022–23 వాటర్ ఇయర్‌లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తికానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటివరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా.. చివరలో బోర్డు చైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశంలో గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా అక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడికాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ప్రధాన అంశం కానుంది.
జల విద్యుత్...
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అవసరం లేకున్నా తెలంగాణ జలవిద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఆర్‌ఎంసీ) సిఫారసుల అమలుపై కూడా చర్చించనున్నారు. జలవిద్యుత్ ఉత్పాదన, రూల్‌కర్వ్ మిగులు జలాల నిర్ధారణ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.
పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌తోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ రూ.1,450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి.
10న కృష్ణా బోర్డు సమావేశం
Published Sat, May 6 2023 1:06 AM | Last Updated on Sat, May 6 2023 10:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment