water distribution issue
-
కృష్ణాజలాల పంపిణీపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీ కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 6న జారీ చేసిన కొత్త విధి విధానాలపై న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విధి విధానాల అమలును నిలిపేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎప్పుడు విచారించాలన్నది సుప్రీం కోర్టు నిర్ణయించనుంది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఈ ట్రిబ్యునల్ అవార్డు గడువు ముగియడంతో 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై 2010 డిసెంబర్ 30న ఓ నివేదికను, 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను అందజేసింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపుల జోలికి వెళ్లని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. 65 శాతం సగటు లభ్యత ఆధారంగా 194 టీఎంసీల మిగులు జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ నివేదికలను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బేసిన్‌లోని రాష్ట్రాలు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ)లను దాఖలు చేశాయి. దీంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటిని కేటాయించి, నీటి లభ్యత తక్కువ ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టులవారీగా జలాల విడుదలకు నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని రూపొందించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు విభజన చట్టం నిర్దేశించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. దీని ప్రకారం 2016 అక్టోబర్ నుంచి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోంది. విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పునఃపంపిణీ కుదరని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను ఈనెల 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ మేరకు కొత్త విధి విధానాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసింది. ఈ విధి విధానాల ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతోపాటు అదనంగా కేటాయించిన జలాలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేసి, రెండు రాష్ట్రాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చాలి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ విస్తృతార్థం ఇస్తూ.. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులుగా కూడా వర్గీకరించింది. ఈ విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. -
10న కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల్లో వాటాల పంపకాలపై ఈ నెల 10న జరిగే కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం ఎజెండా ఖరారైంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణాజలాల్లో చెరి ఏభై శాతం చొప్పున నీటిపంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. 2022–23 వాటర్ ఇయర్లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తికానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటివరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా.. చివరలో బోర్డు చైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశంలో గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా అక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడికాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ప్రధాన అంశం కానుంది. జల విద్యుత్... శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అవసరం లేకున్నా తెలంగాణ జలవిద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సిఫారసుల అమలుపై కూడా చర్చించనున్నారు. జలవిద్యుత్ ఉత్పాదన, రూల్‌కర్వ్ మిగులు జలాల నిర్ధారణ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌తోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ రూ.1,450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. -
తెలంగాణకు 17.. ఏపీకి 25 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ఆయకట్టు అవసరాల కోసం ఈ నెల 15 వరకు ఏపీ 25 టీఎంసీలు, తెలంగాణ 17 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. రబీ సీజన్ జల అవసరాలపై ఈ నెలాఖరులోగా ప్రతిపాద నలు సమర్పించాలని రెండు రాష్ట్రాలను కోరింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం వర్చువల్‌గా సమావేశమైంది. ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ తమ తమ అవసరాలను వివరించారు. 331.708 టీఎంసీల లభ్యత ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అంటే.. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు 350.585 టీఎంసీల కృష్ణా జలాలను వాడు కున్నామని నారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణ 108.235 టీఎంసీలు వాడుకుందని వివరించారు. ఖరీఫ్ అవసరాల కోసం ఈనెల 15 వరకు సాగర్ కుడి కాలువకు 11.77, ఎడమ కాలువకు 2.55, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 5.22, హంద్రీ–నీవాకు 4.14 వెరసి 23.68 టీఎంసీలు కేటాయించాలని కోరారు. ఇప్పటిదాకా వినియోగిం చుకున్న జలాలుపోనూ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, మధ్యతరహా ప్రాజె క్టుల్లో కనీస నీటి మట్టాలకుపైన లభ్యతగా ఉన్న జలాలకు, తుంగభద్ర డ్యామ్‌లో రెండు రాష్ట్రాల వాటా నీటిని కలుపుకొంటే మొత్తం 331.708 టీఎంసీల లభ్యత ఉంటుందని వివరించారు. ఇందులో ఏపీ వాటా 171.163 కాగా, తెలంగాణ వాటా 160.545 టీఎంసీలని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పందిస్తూ.. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను ఖరీఫ్ పంటలు పూర్తయిన తర్వాత తేలుద్దామన్నారు. ఈనెల 15 వరకు రెండు రాష్ట్రాలు అవసరమైన మేరకు నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసింది. కాగా నెలాఖరులోగా రబీ నీటి అవసరాలకు ప్రతిపాదనలను పంపాలన్న బోర్డు సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. -
త్వరలో క్షేత్రస్ధాయి పరిశీలన:మంత్రి ఉమ
-
'కృష్ణా, గోదావరి నీటిలో అధిక వాటానే మా లక్ష్యం'
హైదరాబాద్:కృష్ణా, గోదావరి నీటిలో అధికవాటా సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ జలాలకు సంబంధించి అధిక వాటా సాధించిన అనంతరం ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. శనివారం ' సాక్షి' తో మాట్లాడిన హరీష్ రావు.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేలాల్సి ఉందన్నారు. నదీ జలాల వాటాపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. ఆ తరువాతే ప్రాజెక్టులపై ఆలోచిస్తామన్నారు. హైదరాబాద్‌లో కాకుండా ప్రాజెక్టుల వద్దే సమీక్షలు నిర్వహిస్తామన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడే ఉందని హరీష్ రావు తెలిపారు.