
ప్రతికాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ఆయకట్టు అవసరాల కోసం ఈ నెల 15 వరకు ఏపీ 25 టీఎంసీలు, తెలంగాణ 17 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) అనుమతినిచ్చింది. రబీ సీజన్ జల అవసరాలపై ఈ నెలాఖరులోగా ప్రతిపాద నలు సమర్పించాలని రెండు రాష్ట్రాలను కోరింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం వర్చువల్‌గా సమావేశమైంది. ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ తమ తమ అవసరాలను వివరించారు.
331.708 టీఎంసీల లభ్యత
ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అంటే.. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు 350.585 టీఎంసీల కృష్ణా జలాలను వాడు కున్నామని నారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణ 108.235 టీఎంసీలు వాడుకుందని వివరించారు. ఖరీఫ్ అవసరాల కోసం ఈనెల 15 వరకు సాగర్ కుడి కాలువకు 11.77, ఎడమ కాలువకు 2.55, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 5.22, హంద్రీ–నీవాకు 4.14 వెరసి 23.68 టీఎంసీలు కేటాయించాలని కోరారు. ఇప్పటిదాకా వినియోగిం చుకున్న జలాలుపోనూ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, మధ్యతరహా ప్రాజె క్టుల్లో కనీస నీటి మట్టాలకుపైన లభ్యతగా ఉన్న జలాలకు, తుంగభద్ర డ్యామ్‌లో రెండు రాష్ట్రాల వాటా నీటిని కలుపుకొంటే మొత్తం 331.708 టీఎంసీల లభ్యత ఉంటుందని వివరించారు.
ఇందులో ఏపీ వాటా 171.163 కాగా, తెలంగాణ వాటా 160.545 టీఎంసీలని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ స్పందిస్తూ.. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను ఖరీఫ్ పంటలు పూర్తయిన తర్వాత తేలుద్దామన్నారు. ఈనెల 15 వరకు రెండు రాష్ట్రాలు అవసరమైన మేరకు నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసింది. కాగా నెలాఖరులోగా రబీ నీటి అవసరాలకు ప్రతిపాదనలను పంపాలన్న బోర్డు సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment