
సాక్షి, హైదరాబాద్: నీరు, భూమి యాజమాన్య శిక్షణా పరిశోధన సంస్థ (వాలంతరీ) భూములను నీటిపారుదల శాఖ అమ్మకానికి పెడుతోంది. వాలంతరీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధనశాల (టీఎస్‌ఈఆర్‌ఎల్)కు చెందిన 300 ఎకరాలను ప్లాట్లుగా చేసి అమ్మాలని, దీనిపై రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు భూములను అమ్మేందుకు పురపాలక శాఖకు ఆ భూములను అప్పగించాలని యోచిస్తోంది.
వాస్తవానికి వాలంతరీ, టీఎస్‌ఈఆర్‌ఎల్‌కు హిమాయత్‌సాగర్, ప్రేమావతిపేట, కిస్మత్‌పురాలలో 217.15, 224.52 ఎకరాల చొప్పున భూములున్నాయి. ఇందులో వాలంతరీ, టీఎస్‌ఈఆర్‌ఎల్ కార్యాలయాలు పోను మిగిలిన భూములను అమ్మేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ భూములను మున్సిపల్ శాఖ ద్వారా హెచ్‌ఎండీఏకు బదిలీ చేస్తే, ఆ సంస్థ ఎకరాకు 2,900 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టి అమ్మనుందని సమాచారం.
రుణాలు తీసుకునే వెసులుబాటుపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో సొంతవనరుల ద్వారా రాబడులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటిదాకా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని భూములను అమ్మకానికి పెట్టింది. కానీ, తొలిసారిగా నీటిపారుదల శాఖకు చెందిన భూములను ఆదాయ టార్గెట్‌గా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment