నాడు అనుమతులు.. నేడు కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్‌వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’..
.. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్‌కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.
నోటీసులు ఇచ్చిన తహసీల్దార్
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్‌టీఎల్‌లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్‌జోన్‌లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది.
ఎకరా రూ.వంద కోట్లపైనే..!
దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్‌సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్‌కేక్‌లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది.
ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్‌వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.
హుడా ఆమోదంతో నిర్మాణాలు..
ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్‌బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్‌లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉంది.
గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్‌టీఎల్‌పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.
అధికారులు ఏమంటున్నారు?
2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్‌వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్‌టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.
అక్రమమైతే కూల్చేయండి..
వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్‌కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్‌లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్‌ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి
భయభ్రాంతులకు గురిచేయొద్దు
1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్‌ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్‌టీఎల్‌లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్‌టీఎల్ మారుతుందా?
– అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డి
ఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలి
గ్రీన్‌బెల్ట్‌ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్‌కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్‌లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి.
– పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి
Comments
Please login to add a commentAdd a comment