సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షి త మంచి నీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి మార్గదర్శనం కరువైంది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ను ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఖరారు చేసినా, దీనికి ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం దక్కలేదు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కాకుం డా ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఇప్పటికే నీటి పారుదల శాఖ ఓకే చెప్పినా, ప్రభుత్వం ఇంకా నాన్చుతుండటంతో ఎటూ తేలడంలేదు. ఇక ఇప్పటికే మొదలైన రిజర్వాయర్ల పరిధిలోనూ భూసేకరణ, సహాయ పునరావాస పనుల్లో అనేక అవాంతరాలున్నా వాటిని పట్టించుకొని పరిష్కరించేవారే కరువయ్యారు.
ఎట్టకేలకు కొలిక్కి వచ్చినా ముందుకు సాగలే...
శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగిస్తూ, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు, 21 మండలాల పరిధిలోని 3.61 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేలా రూ.6,190 కోట్లతో డిండి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 11న సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అయి తే మొదట ఈ ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతల్లోని రెండో రిజర్వాయర్ ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ నీటిని 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది.
అనంతరం తిరిగి పాలమూరు ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ నుంచే తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ ప్రతిపాదనలతో భూసేకరణ అవసరాలు ఎక్కువగా ఉండటం, అటవీ భూముల ముంపు సైతం ఉండటంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నారు. ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, తర్వాత 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, అటునుంచి తిరిగి 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీరు ప్రవహిస్తుంది. తర్వాత మళ్లీ 3 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్‌లో ప్రవహించి, సహజ సిద్ధ వాగులో కలసి, కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. అటు నుంచి డిండికి నీటిని చేరుస్తారు.
ఈ ప్రతిపాదనకు రూ.1,293.55 కోట్లు అవు తుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను జనవరిలోనే ప్రభుత్వ అనుమతికై పంపినా ఇంతవరకు అనుమతులివ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని సమీక్షించి ఓకే చెబితే కానీ దీనికి అనుమతులు వచ్చేలా కనిపించడం లేదు. అనుమతులు వస్తే కానీ టెండర్లు పిలిచి పనులు చేపట్టడం సాధ్యం కాదు.
భూసేకరణ నిధులకూ తంటాలు..
ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్‌మెంట్ ఖరారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ), చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్ట రాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులను ప్రభుత్వం రూ.3,929 కోట్లతో చేపట్టింది. వీటిలో ప్రధాన పనులు ఇప్ప టికే ఆరంభమయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద 16,135 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8 వేల ఎకరాల మేర పూర్తి చేశారు. మరో 8 వేల ఎకరాలు ఎక్కడికక్కడే ఉంది.
ఇక్కడ సేకరించిన భూములకు సం బంధించి రూ.181 కోట్ల మేర ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో కొత్తగా భూ ములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అదీగాక కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ రైతులకు ఇచ్చిన మాదిరే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్ పరిధిలోని ముంపు గ్రామాలు ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఎక్కువ పరిహారం కోరుతున్నా యి. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపితేనే ప్రాజెక్టులో కదలిక వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment