Dindi Lift Irrigation Project
-
రూ. పది కోట్లు డిపాజిట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానాలో రూ.పది కోట్లు కట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు చేపడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రమౌళీశ్వరరెడ్డి వేర్వే రుగా దాఖలు చేసిన పిటిషన్లను ఎన్జీటీ చెన్నై బెంచ్ గతంలో విచారించిన సంగతి తెలిసిందే. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రూ.528 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.92.85 కోట్లు, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు అదనంగా రూ.300 కోట్లు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.920.85 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దు మొత్తం జరిమానా ఎంతంటూ ధర్మాసనం ప్రశ్నించగా డిండి ప్రాజెక్టు విషయంలో రూ.92 కోట్ల జరిమానా విధించారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ఎవరు పరిష్కరించాలి? కేంద్ర ప్రభుత్వమా? లేక కోర్టు చొరవ తీసుకోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం నుంచి తగిన మార్గదర్శకాలు తీసుకుంటానని న్యాయవాది తెలుపగా మార్గదర్శకాలు త్వరగా తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, ప్రస్తుత డిండి కేసుతో సంబంధం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. చివరగా... ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం డిండి ప్రాజెక్టుకు విధించిన రూ 92 కోట్ల జరిమానాలో రూ.పది కోట్లను కేఆర్ఎంబీ ఎదుట మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన జరిమానా విషయంలో ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై అభ్యంతరం ఉంటే నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పనులు కొనసాగించుకోవచ్చు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తాగు నీటి అవసరాలకు సంబంధించి 75 టీఎంసీల మేర పనులు కొనసాగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఎనీ్టటీ విధించిన రూ.528కోట్ల జరిమానాలపై స్టే ఇస్తూ ఫిబ్రవరి 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రెండు పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేయా లని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
‘డిండి’ సాగునీటి ప్రాజెక్టే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ‘డిండి’ ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టు అని స్పష్టమవుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. త్వరితగతిన వైఖరి చెప్పకుంటే స్టేటస్కో విధించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. డిండి ఎత్తిపోతల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని కృష్ణా బోర్డు, కేంద్ర జలశక్తి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు పక్కనపెడితే.. అసలు ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా –2008 నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా చేయలేదన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి 3.60 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంతో 2015 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం ప్రారంభించిందని చెప్పారు. ఈ వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఉన్నాయన్నారు. పర్యావరణ అనుమతులు లేని ఈ ప్రాజెక్టు నిలిపి వేయాలని ఏజీ శ్రీరామ్ కోరారు. ఏపీ వాదనలపై తెలంగాణ వైఖరి చెప్పాలని ధర్మాసనం కోరింది. మూడు వారాల సమయం కావాలన్న తెలంగాణ ఏఏజీ.. ఏపీ పిటిషన్‌పై ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు తెలిపారు. మూడు వారాల సమయం కావాలని కోరగా ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. ప్రాథమికంగా ఇరిగేషన్ కాంపొనెంటు ఉందని అర్థం అవుతోందని, పర్యావరణ శాఖ అనుమతులు తప్పని సరిగా ఉండాలని స్పష్టం చేసింది. సమయం ఎక్కువ కోరితే స్టేటస్ కో విధిస్తామని పేర్కొంది. ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ప్రారంభమైందని, కాలపరిమితి ముగిసిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి విచారణకు అర్హత లేదని రాంచందర్‌రావు తెలిపారు. ఈ తరహా పిటిషన్లు వ్యక్తులు దాఖలు చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కాదన్నారు. 2007లో ఈ ప్రాజెక్టుకు జీవోలు జారీ అయినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో మళ్లీ జీవోలు ఇచ్చారని ఏపీ ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ శాఖ తదితరులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఈ నెల 8 లోగా వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. -
'డిండి' దారెటు?
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షి త మంచి నీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి మార్గదర్శనం కరువైంది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ను ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఖరారు చేసినా, దీనికి ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం దక్కలేదు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కాకుం డా ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఇప్పటికే నీటి పారుదల శాఖ ఓకే చెప్పినా, ప్రభుత్వం ఇంకా నాన్చుతుండటంతో ఎటూ తేలడంలేదు. ఇక ఇప్పటికే మొదలైన రిజర్వాయర్ల పరిధిలోనూ భూసేకరణ, సహాయ పునరావాస పనుల్లో అనేక అవాంతరాలున్నా వాటిని పట్టించుకొని పరిష్కరించేవారే కరువయ్యారు. ఎట్టకేలకు కొలిక్కి వచ్చినా ముందుకు సాగలే... శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగిస్తూ, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు, 21 మండలాల పరిధిలోని 3.61 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేలా రూ.6,190 కోట్లతో డిండి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 11న సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అయి తే మొదట ఈ ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతల్లోని రెండో రిజర్వాయర్ ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ నీటిని 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. అనంతరం తిరిగి పాలమూరు ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ నుంచే తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ ప్రతిపాదనలతో భూసేకరణ అవసరాలు ఎక్కువగా ఉండటం, అటవీ భూముల ముంపు సైతం ఉండటంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నారు. ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, తర్వాత 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, అటునుంచి తిరిగి 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీరు ప్రవహిస్తుంది. తర్వాత మళ్లీ 3 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్లో ప్రవహించి, సహజ సిద్ధ వాగులో కలసి, కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. అటు నుంచి డిండికి నీటిని చేరుస్తారు. ఈ ప్రతిపాదనకు రూ.1,293.55 కోట్లు అవు తుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను జనవరిలోనే ప్రభుత్వ అనుమతికై పంపినా ఇంతవరకు అనుమతులివ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని సమీక్షించి ఓకే చెబితే కానీ దీనికి అనుమతులు వచ్చేలా కనిపించడం లేదు. అనుమతులు వస్తే కానీ టెండర్లు పిలిచి పనులు చేపట్టడం సాధ్యం కాదు. భూసేకరణ నిధులకూ తంటాలు.. ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్మెంట్ ఖరారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ), చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్ట రాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులను ప్రభుత్వం రూ.3,929 కోట్లతో చేపట్టింది. వీటిలో ప్రధాన పనులు ఇప్ప టికే ఆరంభమయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద 16,135 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8 వేల ఎకరాల మేర పూర్తి చేశారు. మరో 8 వేల ఎకరాలు ఎక్కడికక్కడే ఉంది. ఇక్కడ సేకరించిన భూములకు సం బంధించి రూ.181 కోట్ల మేర ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో కొత్తగా భూ ములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అదీగాక కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ రైతులకు ఇచ్చిన మాదిరే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్ పరిధిలోని ముంపు గ్రామాలు ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఎక్కువ పరిహారం కోరుతున్నా యి. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపితేనే ప్రాజెక్టులో కదలిక వస్తుంది. -
ఏదుల నుంచే డిండికి నీరు
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకానికి తుదిరూపం వచ్చింది. నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌పై ఇన్నాళ్లూ ఉన్న సందిగ్ధతకు తెరపడింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మొదట నీటిని తరలించాలని భావించినా, దాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం మరో రిజర్వాయరైన ఏదుల నుంచే నీటిని తీసుకునేలా తుది ప్రణాళిక ఖరారైంది. రూ.1,330 కోట్లతో ఈ ప్రణాళికను త్వరలోనే ప్రభుత్వం ఆమోదించనుంది. భారీ టన్నెల్ ద్వారా.. డిండి ఎత్తిపోతలతో 4.5 లక్షల ఎకరాలకు పాలమూరులో భాగంగా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా సర్వే చేశారు. నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునే పక్షంలో కాల్వకుర్తి ప్రాజెక్టు కింది ఆయకట్టు దెబ్బతింటుండటం, పంప్‌హౌస్, కాల్వలతో పాటు ఇతర నిర్మాణాలు రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రతిపాదన పక్కన పెట్టారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ కొత్తగా రీసర్వే చేశారు. దీని ప్రకారం పాలమూరులో భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటే ఇబ్బందులు ఉండవని గుర్తించారు. ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానెల్, 2.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్, 16 కిలోమీటర్ల మేర టన్నెల్, మళ్లీ 3.5 కి.మీ. ఓపెన్ చానెల్ ద్వారా నీటిని డిండి ఎత్తిపోతలతో భాగమైన ఉల్పర రిజర్వాయర్‌కు తరలించాలని ప్రతిపాదించారు. దీనికి భూసేకరణ అవ సరాలు తక్కువగా ఉంటాయని రూ.50 కోట్ల మేర ఖర్చు చేస్తే భూ సేకరణ సమస్య తీరుతుందని తేల్చారు. దీనికి రూ.1,330 కోట్లు వ్యయమవుతుందని లెక్కగట్టారు. ఇందులో టన్నెల్ నిర్మాణానికే అధికంగా రూ.860 కోట్ల మేర ఖర్చు కానుంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి నీటిపారుదల శాఖ పంపింది. అక్కడ అనుమతి రాగానే జీవో ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు. -
'డిండి' పై పూటకో మాట: వంశీచంద్ రెడ్డి
హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకం ఫై ప్రభుత్వం పూటకో మాట చెబుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఎస్ఎల్బీసీ ద్వారా తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2007లో జీవో ఇచ్చింది.. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వాలని రూపకల్పన చేశారు. దీని వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సాగుకు నష్టం జరుగుతుందన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు నర్లపూర్ నుంచి కాకుండా సెపరేట్ గా తీసుకపోవాలన్నారు. డిండి ఎత్తిపోతలఫై మహబూబ్ నగర్, నల్గొండ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
డిండి టెండర్ల గడువు వారం పొడిగింపు
- ఈ నెల 17 వరకు పొడగించిన నీటి పారుదల శాఖ సాక్షి, హైదరాబాద్ డిండి ఎత్తిపోతలకు సంబంధించి టెండర్ల గడువును ప్రభుత్వం మరో వారంపాటు పొడగించింది. ప్రాజెక్టు సాంకేతిక టెండర్లను మంగళవారం తెరవాల్సి ఉన్నప్పటికీ దాన్ని మరో వారం పాటు పొడగిస్తూ నీటి పారుదల శాఖ నిర్ణయం చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో కాంట్రాక్టర్లు పలు సవరణలు కోరడం, వాటిని ఆమోదించిన ప్రభుత్వం టెండర్ల నోటిఫికేషన్ వాటిని చేర్చి సవరణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఈనెల 17 ప్రాజెక్టు సాంకేతిక టెండర్లను తెరిచే అవకాశాలున్నట్లు నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. రూ.3,940కోట్లతో ప్రాజెక్టును 7 ప్యాకేజీలుగా విభజించి గత నెల 20న డిండికి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. -
నేడు డిండికి శంకుస్థాపన
మరోమారు జిల్లాకు సీఎం కేసీఆర్ ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 3 లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చిన ప్రభుత్వం ఎన్నో అంచనాలు.. ఎన్నెన్నో అనుమానాలు.. ఊహాగానాలు.. హెలికాప్టర్లో ముఖ్యమంత్రే స్వయంగా చక్కర్లు.. రోజుల తరబడి సర్వేలు.. వీటన్నింటికీ తెరతీస్తూ సీఎం కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పనులను కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. మర్రిగూడ మం డలం శివన్నగూడెంలో రిజర్వాయర్ నిర్మించనున్న ప్రదేశంలో పైలాన్‌ను ఆవిష్కరించి శంకుస్థాపన చేస్తారు. డిండి ఎత్తిపోతల పథకం మొదట అనుకున్నట్లుగా కాకుండా ప్రాజెక్టు స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. దేవరకొండ : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలోనే హామీఇచ్చిన కేసీఆర్ అనేకమంది ఇంజినీరింగ్ నిపుణుల సలహాలు, అత్యధిక ప్రయోజనం దృష్ట్యా ప్రాజెక్టు స్వరూపం మార్చి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా శ్రీశైలం నుంచి నక్కలగండి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడినుంచి మిడ్ డిండి వద్ద 11 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేసి, అక్కడినుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయాలని భావించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖర్చు అధికం కావడంతో పాటు ప్రజలకు ఒనగూరే ప్రయోజనం కూడా తక్కువ కావడంతో దీని డిజైన్‌ను మార్చాలనుకున్నారు. ఇందుకోసం మరో రెండు డిజైన్లను కూడా రూపొందించారు. అయితే రెండు డిజైన్లలో ఏదో ఒక డిజైన్‌లో ప్రాజెక్టును చేపడతారని భావించగా అనూహ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్‌ను పూర్తిగా మార్చి నిర్ణయం తీసుకుంది. మారిన ప్రాజెక్టు స్వరూపం ఇలా.. ఈ ప్రాజెక్టు విషయమై ఇంజినీరింగ్ నిపుణులతో ఏరియల్ సర్వే చేయించడంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే రెండు సార్లు ఏరియల్ సర్వే చేశారు. ఆ తరువాత ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్‌తో సంబంధం లేకుండా నేరుగా శ్రీశైలంనుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ప్రకారం శ్రీశైలం నుంచి 30 టీఎంసీల నీటిని డ్రా చేసి నిల్వ చేసుకోవడంతోపాటు నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 3 లక్షల 40వేల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించేందుకు డిజైన్ రూపొందించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్‌ను తవ్వుతారు. అక్కడినుంచి 500 మీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించి అక్కడినుంచి 100 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తారు. అక్కడినుంచి 7.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్ తవ్వి ఆలేరు అనే ప్రదేశంలో సిస్టర్న్ నిర్మించి అక్కడినుంచి గ్రావిటీ ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీటిని లిఫ్ట్ చేస్తారు. డిండి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరిన తర్వాత అక్కడినుంచి 92 కిలోమీటర్ల మేర జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు నీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని చారగొండ, నల్లగొండ జిల్లాలోని ఇద్దంపల్లి, తూర్పుపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం గ్రామాల సమీపంలో 5 రిజర్వాయర్లను నిర్మిస్తారు. ఈ 5 రిజర్వాయర్లలో 30 టీఎంసీల సామర్థ్యంతో నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.7800 కోట్లు ఖర్చు పెట్టనుంది.