సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకానికి తుదిరూపం వచ్చింది. నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌పై ఇన్నాళ్లూ ఉన్న సందిగ్ధతకు తెరపడింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మొదట నీటిని తరలించాలని భావించినా, దాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం మరో రిజర్వాయరైన ఏదుల నుంచే నీటిని తీసుకునేలా తుది ప్రణాళిక ఖరారైంది. రూ.1,330 కోట్లతో ఈ ప్రణాళికను త్వరలోనే ప్రభుత్వం ఆమోదించనుంది.
భారీ టన్నెల్ ద్వారా..
డిండి ఎత్తిపోతలతో 4.5 లక్షల ఎకరాలకు పాలమూరులో భాగంగా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా సర్వే చేశారు. నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునే పక్షంలో కాల్వకుర్తి ప్రాజెక్టు కింది ఆయకట్టు దెబ్బతింటుండటం, పంప్‌హౌస్, కాల్వలతో పాటు ఇతర నిర్మాణాలు రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రతిపాదన పక్కన పెట్టారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ కొత్తగా రీసర్వే చేశారు. దీని ప్రకారం పాలమూరులో భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటే ఇబ్బందులు ఉండవని గుర్తించారు.
ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానెల్, 2.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్, 16 కిలోమీటర్ల మేర టన్నెల్, మళ్లీ 3.5 కి.మీ. ఓపెన్ చానెల్ ద్వారా నీటిని డిండి ఎత్తిపోతలతో భాగమైన ఉల్పర రిజర్వాయర్‌కు తరలించాలని ప్రతిపాదించారు. దీనికి భూసేకరణ అవ సరాలు తక్కువగా ఉంటాయని రూ.50 కోట్ల మేర ఖర్చు చేస్తే భూ సేకరణ సమస్య తీరుతుందని తేల్చారు. దీనికి రూ.1,330 కోట్లు వ్యయమవుతుందని లెక్కగట్టారు. ఇందులో టన్నెల్ నిర్మాణానికే అధికంగా రూ.860 కోట్ల మేర ఖర్చు కానుంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి నీటిపారుదల శాఖ పంపింది. అక్కడ అనుమతి రాగానే జీవో ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment