మరోమారు జిల్లాకు సీఎం కేసీఆర్
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 3 లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు
ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చిన ప్రభుత్వం
ఎన్నో అంచనాలు.. ఎన్నెన్నో అనుమానాలు.. ఊహాగానాలు.. హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రే స్వయంగా చక్కర్లు.. రోజుల తరబడి సర్వేలు.. వీటన్నింటికీ తెరతీస్తూ సీఎం కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పనులను కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. మర్రిగూడ మం డలం శివన్నగూడెంలో రిజర్వాయర్ నిర్మించనున్న ప్రదేశంలో పైలాన్‌ను ఆవిష్కరించి శంకుస్థాపన చేస్తారు. డిండి ఎత్తిపోతల పథకం మొదట అనుకున్నట్లుగా కాకుండా ప్రాజెక్టు స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు.
దేవరకొండ : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలోనే హామీఇచ్చిన కేసీఆర్ అనేకమంది ఇంజినీరింగ్ నిపుణుల సలహాలు, అత్యధిక ప్రయోజనం దృష్ట్యా ప్రాజెక్టు స్వరూపం మార్చి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా శ్రీశైలం నుంచి నక్కలగండి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడినుంచి మిడ్ డిండి వద్ద 11 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేసి, అక్కడినుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయాలని భావించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖర్చు అధికం కావడంతో పాటు ప్రజలకు ఒనగూరే ప్రయోజనం కూడా తక్కువ కావడంతో దీని డిజైన్‌ను మార్చాలనుకున్నారు. ఇందుకోసం మరో రెండు డిజైన్లను కూడా రూపొందించారు. అయితే రెండు డిజైన్లలో ఏదో ఒక డిజైన్‌లో ప్రాజెక్టును చేపడతారని భావించగా అనూహ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్‌ను పూర్తిగా మార్చి నిర్ణయం తీసుకుంది.
మారిన ప్రాజెక్టు స్వరూపం ఇలా..
ఈ ప్రాజెక్టు విషయమై ఇంజినీరింగ్ నిపుణులతో ఏరియల్ సర్వే చేయించడంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే రెండు సార్లు ఏరియల్ సర్వే చేశారు. ఆ తరువాత ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం నుంచి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌తో సంబంధం లేకుండా నేరుగా శ్రీశైలంనుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ప్రకారం శ్రీశైలం నుంచి 30 టీఎంసీల నీటిని డ్రా చేసి నిల్వ చేసుకోవడంతోపాటు నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 3 లక్షల 40వేల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించేందుకు డిజైన్ రూపొందించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్‌ను తవ్వుతారు. అక్కడినుంచి 500 మీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించి అక్కడినుంచి 100 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తారు. అక్కడినుంచి 7.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్ తవ్వి ఆలేరు అనే ప్రదేశంలో సిస్టర్న్ నిర్మించి అక్కడినుంచి గ్రావిటీ ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీటిని లిఫ్ట్ చేస్తారు. డిండి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరిన తర్వాత అక్కడినుంచి 92 కిలోమీటర్ల మేర జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు నీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించారు.
ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని చారగొండ, నల్లగొండ జిల్లాలోని ఇద్దంపల్లి, తూర్పుపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం గ్రామాల సమీపంలో 5 రిజర్వాయర్లను నిర్మిస్తారు. ఈ 5 రిజర్వాయర్లలో 30 టీఎంసీల సామర్థ్యంతో నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.7800 కోట్లు ఖర్చు పెట్టనుంది.
నేడు డిండికి శంకుస్థాపన
Published Thu, Jun 11 2015 11:45 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement