సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆయనతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గతంలోనూ లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డారు. ఇక, సోదాల్లో భాగంగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.
గండిపేట బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో నిబంధనకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇక, నికేష్ పేరిట మూడు ఇల్లులు ఉండగా.. ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక, కొల్లూరులో ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు.
Comments
Please login to add a commentAdd a comment