మహదేవపూర్‌లో బ్యారేజీ రికార్డులు స్వాధీనం చేసుకొని కారులో తరలిస్తున్న విజిలెన్స్ అధికారులు
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/తిమ్మాపూర్(మాన కొండూర్)/కరీంనగర్‌క్రైం/జ్యోతినగర్(రామగుండం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఈ విషయం వెల్లడించారు.
ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన 10 కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి విస్తృత తనిఖీలు జరిపాయి. క్షేత్ర స్థాయిలో డివిజనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఈఎన్‌సీ, సీఈ, ఎస్‌ఈల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి.
జలసౌధలో 50 మంది అధికారులు
హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఫైళ్లను తనిఖీ చేశారు. ఒకటో అంతస్తులో ఉండే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, గజ్వేల్ ఈఎన్‌సీ బి.హరిరామ్ క్యాంప్ కార్యాలయం, రెండో అంతస్తులో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్ స్వీయ పర్యవేక్షణ కింద ఉండే కీలకమైన ప్రాజెక్టు అండ్ మానిటరింగ్ (పీఅండ్‌ఎం), హైడ్రాలజీ విభాగాల్లో తనిఖీలు జరిగాయి.
అలాగే ఐదో అంతస్తులోని రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్ కార్యాలయం, ఆరో అంతస్తులోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఓ), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు సంబంధించిన ఫైళ్లను కూడా అధికారులు జప్తు చేసి తీసుకెళ్లారు. సీడీఓ సీఈ కార్యాలయం నుంచి బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల డిజైన్లు, డ్రాయింగ్స్‌ను పట్టుకెళ్లారు.
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ కింద చేపట్టిన రెండు టీఎంసీల ప్రాజెక్టు పనులతో పాటు మూడో టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లారు. మొత్తం అన్ని సర్వేలు, వ్యయ అంచనాలు, డీపీఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, పనుల్లో నాణ్యతా పర్యవేక్షణ, నిర్వహించిన పరీక్షలు, బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను కూడా పట్టుకెళ్లారు.
రాకపోకలు బంద్..సెల్‌ఫోన్ల స్వాదీనం
తనిఖీల సమయంలో లోపలి వ్యక్తులు బయటికి వెళ్లేందుకు, బయటి వ్యక్తులు లోనికి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. అలాగే తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా అధికారుల ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం.
కుంగిన పియర్ల పరిశీలన
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహదేవపూర్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్లను పరిశీలించారు. మరో బృందం కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ మునిగిన ప్రాంతం, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించింది. పలు కీలక రికార్డులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. ప్రాజెక్టు డీపీఆర్, సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు, బ్యారేజీ, పంపుహౌస్‌ల డ్రాయింగ్, డిజైన్‌లు తదితర వివరాలు స్థానిక అధికారులను అడిగారు.
నిర్మాణ పనులు పూర్తయిన సర్టిఫికెట్స్, భూమి అక్విటెన్స్ స్థితి, ప్రస్తుత పనులపై కూడా ఆరా తీశారు. నీటి విడుదల, విద్యుత్ వినియోగ వివరాలు, అధికారుల బదిలీల వివరాలు, ఫిర్యాదులు, ఆర్టిలతో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. మరోవైపు తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
ఇవి కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. స్థానికంగా పలు ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కాగా బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ రమణారెడ్డి తెలిపారు.
హైకోర్టు సీజేకు ప్రభుత్వం లేఖ
గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఆధ్వర్యంలోని బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే బ్యారేజీ కుంగిందని నివేదిక సమర్పించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తామని ఇటీవల రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మేడిగడ్డపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ గతంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది.
నేడు ముఖ్యమంత్రి సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. న్యాయ విచారణ విషయమై గతంలోనే నిర్ణయం తీసుకోగా, తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి మూలకారణాలు తెలుసుకోవడం, బ్యారేజీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, బుంగలు ఏర్పడిన అన్నారం బ్యారేజీతో పాటు సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించడానికి నిర్వహించాల్సిన పరీక్షలు.. తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment