Vigilance and Enforcement Department
-
మేడిగడ్డపై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/తిమ్మాపూర్(మాన కొండూర్)/కరీంనగర్‌క్రైం/జ్యోతినగర్(రామగుండం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆధ్వర్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన 10 కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి విస్తృత తనిఖీలు జరిపాయి. క్షేత్ర స్థాయిలో డివిజనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఈఎన్సీ, సీఈ, ఎస్ఈల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. జలసౌధలో 50 మంది అధికారులు హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఫైళ్లను తనిఖీ చేశారు. ఒకటో అంతస్తులో ఉండే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ క్యాంప్ కార్యాలయం, రెండో అంతస్తులో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ స్వీయ పర్యవేక్షణ కింద ఉండే కీలకమైన ప్రాజెక్టు అండ్ మానిటరింగ్ (పీఅండ్ఎం), హైడ్రాలజీ విభాగాల్లో తనిఖీలు జరిగాయి. అలాగే ఐదో అంతస్తులోని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్ కార్యాలయం, ఆరో అంతస్తులోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఓ), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు సంబంధించిన ఫైళ్లను కూడా అధికారులు జప్తు చేసి తీసుకెళ్లారు. సీడీఓ సీఈ కార్యాలయం నుంచి బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల డిజైన్లు, డ్రాయింగ్స్‌ను పట్టుకెళ్లారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ కింద చేపట్టిన రెండు టీఎంసీల ప్రాజెక్టు పనులతో పాటు మూడో టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లారు. మొత్తం అన్ని సర్వేలు, వ్యయ అంచనాలు, డీపీఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, పనుల్లో నాణ్యతా పర్యవేక్షణ, నిర్వహించిన పరీక్షలు, బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను కూడా పట్టుకెళ్లారు. రాకపోకలు బంద్..సెల్ఫోన్ల స్వాదీనం తనిఖీల సమయంలో లోపలి వ్యక్తులు బయటికి వెళ్లేందుకు, బయటి వ్యక్తులు లోనికి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. అలాగే తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా అధికారుల ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. కుంగిన పియర్ల పరిశీలన ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహదేవపూర్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్లను పరిశీలించారు. మరో బృందం కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ మునిగిన ప్రాంతం, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించింది. పలు కీలక రికార్డులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. ప్రాజెక్టు డీపీఆర్, సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు, బ్యారేజీ, పంపుహౌస్‌ల డ్రాయింగ్, డిజైన్లు తదితర వివరాలు స్థానిక అధికారులను అడిగారు. నిర్మాణ పనులు పూర్తయిన సర్టిఫికెట్స్, భూమి అక్విటెన్స్ స్థితి, ప్రస్తుత పనులపై కూడా ఆరా తీశారు. నీటి విడుదల, విద్యుత్ వినియోగ వివరాలు, అధికారుల బదిలీల వివరాలు, ఫిర్యాదులు, ఆర్టిలతో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. మరోవైపు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇవి కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. స్థానికంగా పలు ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కాగా బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ రమణారెడ్డి తెలిపారు. హైకోర్టు సీజేకు ప్రభుత్వం లేఖ గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే బ్యారేజీ కుంగిందని నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తామని ఇటీవల రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మేడిగడ్డపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ గతంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. నేడు ముఖ్యమంత్రి సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. న్యాయ విచారణ విషయమై గతంలోనే నిర్ణయం తీసుకోగా, తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి మూలకారణాలు తెలుసుకోవడం, బ్యారేజీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, బుంగలు ఏర్పడిన అన్నారం బ్యారేజీతో పాటు సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించడానికి నిర్వహించాల్సిన పరీక్షలు.. తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు
-
వంట నూనెల విక్రయాలకు 150 కియోస్కులు
సాక్షి, అమరావతి: మునిసిపల్ మార్కెట్లు, సూపర్ బజార్లలో ప్రభుత్వ ఔట్లెట్ల ద్వారా వంట నూనెల విక్రయాలను పెంచనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వంట నూనెల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం నియమించిన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సోమవారం భేటీ అయిందన్నారు. ఏపీ ఆయిల్‌ఫెడ్ ద్వారా 111 మునిసిపాలిటీలు, 34 కార్పొరేషన్లలో వంట నూనెల విక్రయాలకు 150 కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఆయిల్‌ఫెడ్ ఉత్పత్తులను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన రెండు వారాల్లో వంట నూనెల ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. సన్‌ఫ్లవర్ నూనె లీటర్ రూ.191, వేరుశనగ నూనె రూ.175, పామాయిల్ రూ.155కు మార్కెట్లో లభ్యమవుతున్నాయని చెప్పారు. నూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా వంట నూనెల అక్రమ నిల్వలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం 337 హోల్‌సేల్, రిటైల్ దుకాణాలతోపాటు సూపర్ మార్కెట్లు, ఆయిల్ తయారీ సంస్థలపై దాడులు చేసి 141 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరుకుల చట్టం కింద 65, తూనికలు–కొలతలు చట్టం కింద 1,056, ఆహార భద్రత చట్టం కింద 41, మరో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు -
కృత్రిమ కొరత సృష్టిస్తే కొరడా
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రాష్ట్రంలో చాలామంది వ్యాపారులు వంటనూనెల పాత నిల్వలను దాచేయడం ద్వారా కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేస్తున్నారని.. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యాపార సంస్థలపై బైండోవర్ కేసులు పెడతామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు డీజీ ఎస్.బాగ్చి హెచ్చరించారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా తక్కువ రేట్లకే వంట నూనెలను అందిస్తుండటంతో పాటు విజిలెన్స్ తనిఖీలు కూడా సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఫలితంగా రెండు, మూడ్రోజులుగా వంట నూనెల ధరలు నిలకడగా ఉన్నాయన్నారు. విజయవాడలోని విజిలెన్స్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని ప్రభుత్వ అవుట్లెట్లలో నూనెలు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసం తగిŠగ్ ధరలు అదుపులోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే పలువురు వ్యాపారులు, వివిధ సంస్థలతో సమావేశం నిర్వహించి సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచాలని కోరినప్పటికీ వారిలో మార్పు రాలేదన్నారు. ఇకపై మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలోనూ 7 నుంచి 10 బృందాలు నిత్యం తనిఖీల్లో పాల్గొంటున్నాయని బాగ్చి వివరించారు. రూ.29 కోట్ల విలువైన నూనె నిల్వలు సీజ్ ఈ నెల 6 నుంచి 19 వరకు రాష్ట్రంలోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపార సంస్థలు, సూపర్మార్కెట్లు, నూనెల తయారీ సంస్థలపై 1,890 తనిఖీలు నిర్వహించినట్లు బాగ్చి వెల్లడించారు. వీటిల్లో పరిమితికి మంచి నిల్వలను గుర్తించడంతో నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం (ఈసీ) కింద 59 కేసులు నమోదు చేసి సుమారు రూ.29 కోట్ల విలువైన 1,500 టన్నుల నూనె నిల్వలను సీజ్ చేశామన్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అధిక నిల్వలు ఉన్నాయన్నారు. కృష్ణాజిల్లాలో ప్రియాగోల్డ్ బ్రాండ్‌కు చెందిన పామాయిల్ నిల్వలను అధికంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. సుమారు 5.67 టన్నులు ప్రియాగోల్డ్ బ్రాండ్ నూనె నిల్వలను సీజ్ చేశామన్నారు. స్వలాభం కోసమే ఈ నిల్వలను దాచిపెట్టారన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వారిపై తూనికలు, కొలతల చట్టం కింద 889 కేసులు, ఆహార భద్రత చట్టం కింద 38 కేసులు నమోదు చేశామన్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో తయారీ మరోవైపు.. ఎటువంటి అనుమతుల్లేకుండా వంట నూనెలను స్థానికంగా తయారుచేసి వాటిని ప్రముఖ కంపెనీల పేరుతో విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టామని బాగ్చి వెల్లడించారు. కొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తుంటే.. మరికొన్నిచోట్ల ఎమ్మార్పీనే పెంచేసినట్లు గుర్తించామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తుంటే 94409 06254 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
25 కోవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన 18 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన మేరకు.. రాçష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిల్లో విజిలెన్స్ అధికారులు, వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు, సంబంధిత అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రాష్ట్రంలోని 25 ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలను కరోనా బాధితుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేశాయి. ఆ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, కరోనా మందుల నిల్వలు, సరఫరాలను కూడా సమీక్షించాయి. తనిఖీల సందర్భంగా నరసరావుపేటలోని పువ్వాడ హాస్పిటల్స్‌లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించాయి. తిరుపతి రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్టు గుర్తించాయి. విజయనగరం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఒంగోలులోని ప్రకాశం హాస్పిటల్లో అవసరానికి మించి రోగుల పేరుతో ఇండెంట్ పెట్టి రెమ్‌డెసివిర్, ఇంజక్షన్లు తీసుకున్నట్టు గుర్తించాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా వ్యాధి చికిత్సలు అందించాలని సూచించారు. -
ఆ బురద మాకు కూడా అంటిస్తారా?
సాక్షి, విశాఖ : విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’ అని అన్నారు. ఈఎస్ఐ స్కాం: వారిని శిక్షించాలి.. విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు. -
అక్రమ వ్యాపారం.. కృత్రిమ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాపారులు తమ లాభం కోసం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో ఉల్లి ధరలు దిగిరావడం లేదు. ఉల్లి ధరల మంటకు గల కారణాలను గుర్తించడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టింది. ఉల్లి వ్యాపారం అధికంగా జరిగే కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్రయవిక్రయాలు, గత మూడేళ్లుగా ఉల్లి దిగుబడులు.. తదితర అంశాలను పరిశీలించగా, విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఉల్లి దిగుబడి అధికంగా వచ్చినా.. వ్యాపారులు తమ కమిషన్ కోసం ఉల్లిని ఇతర రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీనికితోడు కొంత సరుకును నల్లబజారుకు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈసారి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ఉల్లి దొరక్కపోవడానికి వ్యాపారుల అక్రమాలే కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై మెరుపు దాడులు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలోని అంశాలు.. - రాష్ట్రంలో రోజుకు 8–9 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం. నవంబరులో కర్నూలు రకం ఉల్లి ప్రధాన మార్కెట్లకు 3.83 లక్షల క్వింటాళ్లు వచ్చింది. ఇందులో దాదాపు 40 శాతం.. అంటే 1.60 లక్షల క్వింటాళ్ల ఉల్లి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయింది. మిగిలిన 2.23 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు 13 జిల్లాల్లోని వినియోగదారులకు సరిపోతాయి. - అయినప్పటికీ ట్రేడర్లు/ఏజెంట్లు కృత్రిమ కొరత సృష్టించారు. తమకు వచ్చే 4 శాతం కమిషన్ కోసం ఇక్కడి ఉల్లిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు చేరుతుండడంతో స్థానికంగా ఉల్లి కొరత కొనసాగుతోంది. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగులు సరుకును మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే ఉల్లి కొరత ఉండదు. - ఉల్లి కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను రోజులుగా ఉల్లిని కొనుగోలు చేసి, రైతుబజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. కర్నూలు మార్కెట్లో కిలో రూ.65 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్లలో రాయితీపై వినియోగదారులకు అమ్ముతోంది. ధరల స్ధిరీకరణ నిధి ద్వారా ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. సబ్సిడీ ఉల్లి అమ్మకాల వల్ల ఇప్పటివరకు రూ.4.50 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడింది. దీనికితోడు ఈజిప్టు నుంచి ఉల్లిపాయల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కేసులో పునర్విచారణ కీలక మలుపు తిరిగింది. 2015లో సీఐడీ దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్తు ఫైలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (వీ అండ్ ఈ) కోర్టుకు చేరింది. తమ విచారణలోని అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దర్యాప్తు చేసి నివేదికివ్వాలని సీఐడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు లేఖ రాశారు. ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తు 36 గ్రామాల్లోనే సాగింది. ఇప్పుడు అన్ని గ్రామాల్లో విచారణ జరిపేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 2009 తర్వాత ఎంతమంది బిల్లులు పొందారు.. ఏ మేరకు అక్రమాలు జరిగాయి? పాత్రధారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అనే వివరాలనూ ఆరాతీయనుంది. కాగా, విజిలెన్స్ విచారణ అంశాలను బట్టి తాము చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని, దర్యాప్తులో ఎదురయ్యే అంశాలను బట్టి ఆయా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదుకు విజిలెన్స్ సిఫారసు చేస్తుందని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. -
అక్రమ నిల్వలు.. అదుపుతప్పిన ధరలు!
దసరా వేళ కొనుగోళ్లు ఎలా? గ్రేటర్లో భారీగా నిత్యావసరాల అక్రమ నిల్వలు వినియోగదారుల బెంబేలు పట్టించుకోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నగరంలో నిత్యావసరాల అక్రమ నిల్వలు పేరుకుపోతున్నాయి. పప్పుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కందిపప్పును పెద్దమొత్తంలో గోదాముల్లో దాచేశారన్న విషయాన్ని అధికారులు పెడచెవిన పెడుతుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పం డుగ దినాల్లో కందిపప్పు ధర ఇంతలా పెరగడానికి అక్రమ నిల్వలే కారణమన్నది బహిరంగ రహస్యమే. అయితే... అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపి పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వ్యాపారులకు మాత్రమే సరుకు నిల్వ చేసుకొనే అవకాశం ఉంది. నగరంలో లెసైన్స్ పొందినవ్యాపారులు 2300 మందికి మించి లేరని స్వయంగా పౌరసరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. ఎంతోమంది లెసైన్స్ లేకుండానే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నా అటువైపు కన్నెత్తి చూసే నాథుడే లేదు. నెలవారీ మామూళ్ల మాటున అక్రమ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా సాగుతున్నాయి. ఫలితం లేని దాడులు అప్పుడప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దాడుల్లో అక్రమ నిల్వల వ్యవహారం వెలుగు చూస్తున్నా... వాటివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరట్లేదు. ఆకస్మిక దాడుల్లో అధికారులు సీజ్ చేసిన సరుకును చౌకధరల దుకాణాలకు మళ్లించడమో, లేక బహిరంగ మార్కెట్లో వేలం వేసి విక్రయిస్తే కొంతమేర ఫలితం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో నామ మాత్రపు జరిమానా విధించి వదిలేస్తుండటంతో వ్యాపారుల్లో భయం అనేది లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు దాడులకు వస్తున్న విషయాన్ని కిందిస్థాయి సిబ్బంది ముందే సంబంధిత వ్యాపారులకు చేరవేస్తుండటంతో సరుకును గోదాము నుంచి దాటించేస్తున్నారు. దీంతో అక్రమాల వ్యవహారం బయటపడట్లేదు. పొంతనలేని ధరలు ప్రభుత్వం నిర్ణయించి నిత్యావసర వస్తువుల ధరలకు ... మార్కెట్లో వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. బహిరంగ మార్కెట్లో కంది పప్పు కేజీ రూ.200లు ధర పలుకుతుంటే... ప్రభుత్వ జాబితాలో మాత్రం కందిపప్పు ధర రూ.160గా చూపుతుండటం మరీ విడ్డూరంగా ఉంది. మిగతా ధరల విషయంలో కూడా అసలు పొంతన కుదరడం లేదన్నది బహిరంగ రహస్యమే. రేషన్ షాపుల్లో నో స్టాక్ గ్రేటర్ హైదరాబాద్‌లోని రేషన్ షాపుల్లో కంది పప్పు ‘నో స్టాక్’గా మారింది. బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర ఒకే సారి కిలో రూ. 200 లకు పెరగడంతో డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో లబ్ధిదారులకు రూ.50 లకు కిలో చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీంతో డీలర్లు లబ్ధిదారులకు కంది పప్పు పంపిణీ చేయకుండా సరుకు సరఫరా కాలేదని తప్పించుకుంటున్నారు. వాస్తవంగా మహా నగరంలో అక్టోబర్ నెలకు సంబంధించిన కందిపప్పు కోటా కేటాయింపు, విడుదల తోపాటు అందులో 75 శాతం చౌకధరల దుకాణాలకు సరఫరా అయింది. హైదరాబాద్ పౌరసరఫరా విభాగం పరిధిలోని తొమ్మిది సర్కిల్స్‌లో అక్టోబర్ మాసానికి మొదటి విడత కింద 7,80,950 కిలోల కంది పప్పు కేటాయింపు జరుగగా, అందులో ఇప్పటికే 6,13,064 కిలోల కంది పప్పు వరకు చౌకధరల దుకాణాలకు సరఫరా అయినట్లు పౌరసరఫరాల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతాలలో సైతం 75 శాతం కోటా కేటాయింపు జరిగి చౌకధరల దుకాణాలకు సరఫరా అయింది. క్షేత్ర స్థాయిలో మాత్రం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు కంది పప్పు అందని దాక్షగా మారింది. రైతు బజార్లలో మూతపడిన కేంద్రాలు ఇక రైతుబజార్లలో ఏర్పాటు చేసిని కందిపప్పు విక్రయ కేంద్రాలు మూతపడ్డాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్ పరిధిలో రెండు, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో కంది పప్పు రూ.100లు, రెండో రకం రూ. 90ల చొప్పున విక్రయించారు. ప్రస్తుతం కంది పప్పు ధరలు ఒకే సారి పెరగడంతో తిరిగి కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరిమితికి మించి నిల్వలు నిబంధనల ప్రకారం వివిధ రకాల పప్పులు హోల్‌సేల్ వ్యాపారి వద్ద 250 క్వింటాళ్లు, అదే రిటైలర్ వద్ద 50 క్వింటాళ్లు కంటే మించకూడదు. గోధుమలు హోల్‌సేల్ వ్యాపారి వద్ద 250 క్వింటాళ్లు, రిటైలర్ వద్ద 20 క్వింటాళ్లు, బియ్యం హోల్‌సేల్ వ్యాపారి వద్ద 1000 క్వింటాళ్లు, రిటైలర్ వద్ద 100 క్వింటాళ్లకంటే మించకూడదు. ట్రేడింగ్ మిల్లర్ల వద్ద బియ్యం 4 వేల క్వింటాళ్లు, నాన్ ట్రేడింగ్ మిల్లర్ల వద్ద 2 వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ నిల్వలు ఉండకూడదు. జంటనగరాల్లో ఈ నిబంధనలు పాటిస్తున్న మిల్లర్లు, వ్యాపారులు ఎంతమంది అంటే...? అది జవాబు లేని ప్రశ్నే. అధికారులు సైతం నీళ్లు నమలాల్సిన పరిస్థితి. అడపదడపా దాడుల్లో ఈ విషయం బహిర్గతమవుతూనే ఉంది. కఠినంగా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతుండటం అక్రమార్కులకు కలిసొస్తుంది. -
సెల్ టవర్లపై విజి‘లెన్స్’
పన్నుల ఎగవేతపై ప్రభుత్వం దృష్టి ఎగ్గొడుతున్న సంస్థల వివరాల సేకరణ పనిలో నిమగ్నమైన కార్యదర్శులు నక్కపల్లి: నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతూ స్థానిక సంస్థలకు బకాయిలను ఎగ్గొడుతున్న సెల్ టవర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏళ్ల తరబడి చెల్లించాల్సిన బకాయిలను ముక్కుపిండి వసూలు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను రంగంలోకి దించింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలో ఏ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఎన్ని సెల్ టవర్లున్నాయి, వాటి ఏర్పాటులో ఆపరేటర్లు నిబంధనలు పాటించారా, లేదా, ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలకు లెసైన్స్ ఫీజు చెల్లించారా లేదా, సెల్‌టవర్ ఏర్పాటులో అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా తదితర వివరాలను విజిలెన్స్, అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధికారులు ఆరా తీస్తున్నారు. వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని సెల్ టవర్ల నిర్మాణాల వివరాల సేకరణలో నిమగ్నమయ్యా రు. జిల్లా వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో 311 సెల్‌టవర్లు ఉండగా గ్రామీణ ప్రాంతంలో 161, పట్టణ ప్రాంతంలో 150 ఉన్నాయి. మరో 52 టవర్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. వివిధ ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్ల ఆధ్వర్యంలో మరో 2000కు పైగా సెల్టవర్లున్నాయి. వీటి ఏర్పాటుకు మార్గదర్శకాలున్నాయి. - భూ ఆధారిత, రూఫ్టాఫ్ (ఎత్తయిన భవనాలపై) సెల్ టవర్లను ఏర్పాటు చేయదలచుకుంటే ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ నుంచి అనుమతి, అగ్నిమాపకశాఖ, చుట్టుపక్కల భవనాల యజమానులనుంచి నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలను తీసుకోవాలి. రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే పక్షంలో సమీప నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు దూరంగా సెల్‌టవర్‌ను ఏర్పాటు చేయాలి. భూ ఆధారిత సెల్‌టవర్ ఏర్పాటు చేస్తే రైతు నుంచి ఒప్పందం తీసుకుని పంచాయతీకి దరఖాస్తు చేయాలి. లెసైన్స్ ఫీజు కింద రూ.15000 చెల్లించాలి. ఏటా రూ.వెయ్యి లెసైన్స్ నవీకరణ ఫీజు కింద చెల్లించాలి. భవనాలపై ఏర్పాటు చేస్తే రూ.12000 చెల్లించాలి. ఇప్పటివరకు ఏర్పాటైన సెల్‌టవర్లు ఎక్కడా ఈ నిబంధనలను పాటించలేదు సరికదా పంచాయతీలు, మున్సిపాలిటీలకు రుసుము చెల్లించ కుండా పన్ను ఎగవేతకు కోర్టును ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటిసెల్టవర్ల నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు రావలసిన బకాయిల వసూలుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దించింది.