
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రాష్ట్రంలో చాలామంది వ్యాపారులు వంటనూనెల పాత నిల్వలను దాచేయడం ద్వారా కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేస్తున్నారని.. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యాపార సంస్థలపై బైండోవర్ కేసులు పెడతామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అదనపు డీజీ ఎస్.బాగ్చి హెచ్చరించారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా తక్కువ రేట్లకే వంట నూనెలను అందిస్తుండటంతో పాటు విజిలెన్స్ తనిఖీలు కూడా సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఫలితంగా రెండు, మూడ్రోజులుగా వంట నూనెల ధరలు నిలకడగా ఉన్నాయన్నారు.
విజయవాడలోని విజిలెన్స్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని ప్రభుత్వ అవుట్‌లెట్లలో నూనెలు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసం తగిŠగ్ ధరలు అదుపులోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే పలువురు వ్యాపారులు, వివిధ సంస్థలతో సమావేశం నిర్వహించి సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచాలని కోరినప్పటికీ వారిలో మార్పు రాలేదన్నారు. ఇకపై మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలోనూ 7 నుంచి 10 బృందాలు నిత్యం తనిఖీల్లో పాల్గొంటున్నాయని బాగ్చి వివరించారు.
రూ.29 కోట్ల విలువైన నూనె నిల్వలు సీజ్
ఈ నెల 6 నుంచి 19 వరకు రాష్ట్రంలోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపార సంస్థలు, సూపర్‌మార్కెట్లు, నూనెల తయారీ సంస్థలపై 1,890 తనిఖీలు నిర్వహించినట్లు బాగ్చి వెల్లడించారు. వీటిల్లో పరిమితికి మంచి నిల్వలను గుర్తించడంతో నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం (ఈసీ) కింద 59 కేసులు నమోదు చేసి సుమారు రూ.29 కోట్ల విలువైన 1,500 టన్నుల నూనె నిల్వలను సీజ్ చేశామన్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అధిక నిల్వలు ఉన్నాయన్నారు. కృష్ణాజిల్లాలో ప్రియాగోల్డ్ బ్రాండ్‌కు చెందిన పామాయిల్ నిల్వలను అధికంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. సుమారు 5.67 టన్నులు ప్రియాగోల్డ్ బ్రాండ్ నూనె నిల్వలను సీజ్ చేశామన్నారు. స్వలాభం కోసమే ఈ నిల్వలను దాచిపెట్టారన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వారిపై తూనికలు, కొలతల చట్టం కింద 889 కేసులు, ఆహార భద్రత చట్టం కింద 38 కేసులు నమోదు చేశామన్నారు.
ప్రముఖ కంపెనీల పేరుతో తయారీ
మరోవైపు.. ఎటువంటి అనుమతుల్లేకుండా వంట నూనెలను స్థానికంగా తయారుచేసి వాటిని ప్రముఖ కంపెనీల పేరుతో విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టామని బాగ్చి వెల్లడించారు. కొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తుంటే.. మరికొన్నిచోట్ల ఎమ్మార్పీనే పెంచేసినట్లు గుర్తించామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తుంటే 94409 06254 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment