సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2021లో క్రియాశీలకంగా వ్యవహరించింది. అవినీతి అధికారులను ట్రాప్‌చేసి అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారిపై చెప్పుకోదగ్గ స్థాయిలో దాడులుచేసి కేసులు నమోదు చేసింది. అలాగే, అవినీతి అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబర్ ‘14400’కు విశేష స్పందన లభించింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఏసీబీ ఈ ఏడాది పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలూ నిర్వహించింది. ఈ మేరకు 2021 వార్షిక నివేదికను ఏసీబీ గురువారం విడుదల చేసింది. ఆ వివరాలు..
72 ట్రాప్ కేసులు..
2021లో 72 మంది ప్రభుత్వ అధికారులు/ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరు రూ.32.40 లక్షలు లంచాలు తీసుకుంటుండగా ట్రాప్‌చేసి కేసులు నమోదు చేసింది. ట్రాప్ కేసుల్లో అత్యధికంగా 36 కేసులు రెవెన్యూ శాఖ అధికారులు/ఉద్యోగులపైనే కావడం గమనార్హం. వాటిలో విశాఖ జిల్లా చోడవరం తహసీల్దారు బి.రవికుమార్ రూ.4 లక్షలు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దారు బి.నాగభూషణరావు రూ.4లక్షలు, ముదిగుబ్బ తహసీల్దారు అన్వర్ హుస్సేన్ రూ.2లక్షలు లంచాలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇక విద్యుత్ శాఖలో 8 కేసులు, పంచాయతీరాజ్ శాఖలో 7 కేసులు, హోం శాఖలో 6 కేసులు, పురపాలక శాఖలో 5 కేసులు, ఇతర శాఖల్లో 10 కేసులను ఏసీబీ నమోదు చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 12..
ఇక ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 12 కేసులు నమోదు చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఎండీగా చేసిన బి.నాగభూషణం ఆదాయనికి మించి రూ.10.79 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న కేసు సంచలనం సృష్టించింది. వాటితోపాటు ఆత్రేయపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా చేసిన వెంకట వరప్రసాదరావు, పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ డీఎం–హెచ్‌వోగా చేసిన ఎం. మార్కండేయ, నంద్యాలలో నీటిపారుదల శాఖ ఈఈగా చేసిన జాకబ్ రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్యా శాఖ ఆడిటర్ కోనేరు సాయికృష్ణ తదితరులపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులున్నాయి.
ఆకస్మిక తనిఖీలు 44..
2021లో ఏసీబీ అధికారులు 44 సార్లు ఆకస్మిక తనిఖీలు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో రెవెన్యూ శాఖ కార్యాలయాలపైనే 23 నిర్వహించడం గమనార్హం. రవాణా–ఆర్ అండ్‌బీ శాఖ కార్యాలయాలపై 6, పురపాలక శాఖ కార్యాలయాలపై 5, విద్యుత్, కార్మిక, పంచాయతీరాజ్ కార్యాలయాలపై రెండేసిసార్లు చొప్పున, మహిళా–శిశు సంక్షేమ కార్యాలయాలపై ఒకసారి తనిఖీలు నిర్వహించింది. వీటితోపాటు 26 సాధారణ తనిఖీలను కూడా ఏసీబీ చేపట్టింది.
5 కేసుల్లో దోషులకు శిక్షలు ఖరారు
కోవిడ్ నిబంధనలతో ఈ ఏడాది కోర్టుల కార్యకలాపాలు అంతంతమాత్రంగా కొనసాగినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిందితుల అవినీతిని ఏసీబీ నిరూపించగలిగింది. 5 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి.
‘14400’కు విశేష స్పందన
ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన ట్రోల్ ఫ్రీ నంబర్ 14400కు ఈ ఏడాది 2,851 ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా 8 ట్రాప్ కేసులు నమోదు చేయడంతోపాటు 16 ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment