సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది.
ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది.
గేట్ల మొరాయింపుతోనే సమస్య
గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్‌సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు.
చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది.
మూడు చోట్ల పగుళ్లు..
ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్‌కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు..
ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది.
ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా..
- కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి.
- అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి.
- అదనపు గేట్లు, కొత్త స్పిల్‌వే నిర్మించాలి.
- గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్‌ఆర్‌పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment