బ్యారేజీలకు మరమ్మతులపై తక్షణమే సిఫారసులు చేయండి
చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ జి.అనీల్‌కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు.
బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది.
ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment