వాటి డిజైన్ల తయారీకి మార్గదర్శకాలు లేవు
మేడిగడ్డ బరాజ్‌లో వాటిని ఎందుకు వాడారు?
సరైన షూటింగ్ వెలాసిటీ, టెయిల్‌పాండ్ లెవల్‌ను అంచనా వేయలేదా?
సీడీఓ మాజీ ఎస్‌ఈని ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
ఆ నిర్ణయం ఫీల్డ్ ఇంజనీర్లు, ఎల్‌అండ్‌టీదే అని ఎస్‌ఈ వివరణ
సాక్షి, హైదరాబాద్: ‘జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరు. సికెంట్ పైల్స్ డిజైన్ల తయారీకి ప్రత్యేక నిబంధనలూ లేవు. మేడిగడ్డ బరాజ్‌కి సికెంట్ పైల్స్ ఎందుకు వాడారు?’అని కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ ఎస్‌ఈ కె.ఎస్.ఎస్.చంద్రశేఖర్‌కు శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో బరాజ్‌ల డిజైన్లపై కమిషన్ కీలక ప్రశ్నలను సంధించింది. దేశంలో జలాశయాల నిర్మాణాల్లో సికెంట్ పైల్స్ వినియోగంపై అప్పట్లో తమ వద్ద సమాచారం లేదని చంద్రశేఖర్ బదులిచ్చారు. ఇన్‌ఫ్రా, సముద్రపు తీర ప్రాజెక్టుల్లో వీటిని వినియోగిస్తున్నారన్నారు. వీటి డిజైన్లకు మార్గదర్శకాలు లేకపోవడంతో బ్రిటిష్ కోడ్‌ను అనుసరించామన్నారు.
సికెంట్ పైల్స్‌పై నిర్ణయం ఫీల్డ్ ఇంజనీర్లు, ఎల్‌అండ్‌టీదే..
మేడిగడ్డ బరాజ్ పునాదు (ర్యాఫ్ట్)ల కింద షీట్‌పైల్స్‌కి బదులు సికెంట్ పైల్స్‌తో కటాఫ్ వాల్ నిర్మించాలని ప్రాజెక్టు క్షేత్ర స్థాయి ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ ‘ఎల్‌అండ్‌టీ’నిర్ణయం తీసుకుందని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాథమిక దశలో నాలుగు బోర్ రంధ్రాలు వేసి నిర్వహించిన మట్టి నమూనా పరీక్షల ఆధారంగా షీట్‌పైల్స్‌ను డిజైన్లలో ప్రతిపాదించామన్నారు. తర్వాత దశలో మరిన్ని బోర్ రంధ్రాలు వేసి పరీక్షలు నిర్వహించగా భూగర్భంలో కంకర మట్టి, ఇసుక రాళ్లు ఉన్నట్టు తేలడంతో షీట్‌పైల్స్‌ను వాడడం సాధ్యం కాదని క్షేత్ర స్థాయి ఇంజనీర్లు నివేదించారన్నారు. తాము ప్రత్యామ్నాయంగా డయాఫ్రమ్ వాల్‌కి డిజైన్లు ఇవ్వగా, క్షేత్ర స్థాయి ఇంజనీర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు సికెంట్ పైల్స్ వేసేందుకు డిజైన్లు కోరారన్నారు.
సరైన షూటింగ్ వెలాసిటీని పరిగణనలోకి తీసుకున్నారా
సీడీఓ విభాగం సరైన డిజైన్లు ఇవ్వకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రశేఖర్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా.. మేడిగడ్డ బరాజ్ నుంచి విడుదలయ్యే వరద వేగాన్ని (షూటింగ్ వెలాసిటీని) సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోలేదని, విడుదలైన వరద నేలను తాకే చోట మట్టికోతకు గురికాకుండా దిగువన సరిపడా నీటి నిల్వలతో టైల్‌పాండ్ ఉండాలనే ఆలోచన చేయలేదని కమిషన్ తప్పుబట్టగా, అందులో వాస్తవం లేదన్నారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా సరైన షూటింగ్ వెలాసిటీ, టైల్‌పాండ్ లెవల్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నేల కోతకు గురై మేడిగడ్డ బరాజ్ కుంగిందని ఓ మోడల్ స్టడీలో తేలడంతో కమిషన్ ఈ కీలక ప్రశ్నను లేవనెత్తింది. అధిక షూటింగ్ వెలాసిటీ ఉండనుందని క్షేత్ర స్థాయి ఇంజనీర్ల నుంచి తమకు లెక్కలు అందలేదన్నారు. వ్యాప్కోస్ నివేదికలోని లెక్కల ఆధారంగా సరైన టైల్‌పాండ్ లెవల్‌తోనే డిజైన్లను తయారు చేశామన్నారు.
డీపీఆర్‌లో నీటి నిల్వ సామర్థ్యం లేదు..
మేడిగడ్డ బరాజ్ డీపీఆర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని సూచించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖర్ తెలిపారు. వ్యాప్కోస్ ఇచి్చన హైడ్రాలజికల్ డేటాను హైపవర్ కమిటీ ఆమోదించిందని, దాని ఆధారంగానే డిజైన్లను తయారు చేశామని వివరించారు. సీఈ సీడీఓ ఇచి్చన డిజైన్లకు నిర్మాణ దశలో చేసిన మార్పులు గుర్తు లేదన్నారు. క్షేత్ర స్థాయి ఇంజనీర్ల సూచనతో బరాజ్‌ల ర్యాఫ్ట్ డిజైన్లలో మార్పులు చేసిచ్చామన్నారు. నీటి నిల్వ సామర్థ్యంపై క్షేత్ర స్థాయి ఇంజనీర్లు ఏమైనా సూచనలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, గుర్తు లేదన్నారు. 2డీ, 3డీ మోడల్ స్టడీస్ తర్వాత డిజైన్లలో మార్పులు చేయాల్సిన అవసరం రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment