బరాజ్ డిజైన్లలో ఎనర్జీ డిస్సిపేషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు
ఐఐటీ–రూర్కీ ఆధ్వర్యంలో నిర్వహించి మోడల్ స్టడీలో నిర్ధారణ
ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి నివేదికపంపిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలే కారణమని ఐఐటీ–రూర్కీ తాజాగా నిర్వహించిన మాడల్ స్టడీలో తేలింది. బరాజ్‌ను 2019 జూన్ 21న ప్రారంభించగా, అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకుపోయాయి. బరాజ్ గేట్లను ఎత్తినప్పుడు భీకర వేగంతో వరద కిందకు దూకుతుంది.
ఆ సమయంలో వరదలో ఉండే భీకర శక్తిని నిర్వీర్యం(ఎనర్జీ డిస్సిపేషన్) చేసేందుకు తగిన నిర్మాణాలను డిజైన్లలో ప్రతిపాదించలేదు. దీంతో ఆ శక్తి ధాటికి దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. బరాజ్‌ను ప్రారంభించిన తొలి ఏడాదే కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయినా, పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బరాజ్‌కు 2020–23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు వరదలు రాగా, ‘ఎనర్జీ డిస్సిపేషన్’ఏర్పాట్లు లేక బరాజ్ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు మరింతగా లోతుగా మారాయి.
నిరంతర వరదలతో బరాజ్ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా నిర్మించిన సికెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. దీంతో సికెంట్ పైల్స్ దెబ్బతినడంతో ర్యాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడడానికి దారితీశాయి. దీనిద్వారా నీళ్లు బయటకు లీకైనట్టు గుర్తించినా, వాటిని పూడ్చివేసే విషయంలో తాత్సారం చేశారు.
దీంతో కాలం గడిచిన కొద్దీ బుంగల తీవ్రత పెరిగి బరాజ్ కుంగిపోవడానికి దారితీసిందని ఐఐటీ–రూర్కీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ విజ్ఞప్తి మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్, ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, ఇతర ఇంజనీర్ల సమక్షంలో ఐఐటీ రూర్కీ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహించారు.
టెయిల్ పాండ్ ఉంటే ....
మేడిగడ్డ బరాజ్ దిగువన తగిన స్థాయిలో నీరు నిల్వ ఉండేలా టెయిల్‌పాండ్ నిర్మాణం లేకపోవడమే అసలు లోపమని మోడ ల్ స్టడీలో తేలింది. బరాజ్ గేట్ల నుంచి భీకర వేగంతో వరద దిగువన టెయిల్‌పాండ్‌లోని నీళ్లలో దూకినప్పుడు అందులోని శక్తి విభజనకులోనై అన్నివైపులా వ్యాప్తి చెంది చివరకు నిర్వీర్య మైపోతుంది. దీనినే ఎనర్జీ డిస్సిపేషన్ అంటారు. మేడి గడ్డ బరాజ్ గేట్లను దిగువన తగిన స్థాయిలో నీరు నిల్వ ఉండేలా టెయిల్‌పాండ్ నిర్మాణాన్ని డిజైన్లలో ప్రతిపాదించలేదని నీటిపా రుదలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
వరదలు తక్కు వగా ఉన్నప్పుడు బరాజ్ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపి వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు వదులుతారు. ఆ సమయంలో సైతం బరాజ్‌లో గరిష్ట మట్టం మేరకు నిల్వలుండడంతో గేట్ల నుంచి బయటకు వచ్చే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు ఏకంగా 30 మీటర్ల వరకు భీకర వేగంతో వరద బయటకు వస్తోందని మోడల్ స్టడీలో తేలినట్టు తెలిసింది.
దీంతోనే బరాజ్ దిగువన రక్షణగా ఉండాల్సిన సీసీ బ్లాకులు కొట్టుకు పోయి వాటి స్థానంలో గుంతలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత గుంతలు లోతుగా మారి పునాదులను దెబ్బతీశాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఐఐటీ రూర్కీ మాడల్ స్టడీస్ నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment