బరాజ్‌లలో బుంగలను
పూడ్చేయడంతో పరిస్థితుల్లో మార్పులు
పరీక్షలు చేసినా సరైన కారణాలు తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోయాం
3 బరాజ్‌లకు గతంలో నిర్దేశించిన 5 పరీక్షల నివేదికలు ఇకపై అనవసరం
ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌కు రాసిన లేఖలో నిపుణుల కమిటీ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల కింద ఏర్పడిన బుంగలను తమ సిఫార్సులకు విరుద్ధంగా నీటిపారుదల శాఖ గ్రౌటింగ్ ద్వారా పూడ్చేయడంతో భూగర్భంలోని స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపు ణుల కమిటీ వెల్లడించింది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా బరాజ్‌ల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవ కారణాలను తెలుసుకోలేమని తేల్చిచెప్పింది. అందువల్ల గతంలో తాము మధ్యంతర నివేదికలో నిర్దేశించిన వివిధ పరీక్షలు, అధ్యయనాల జాబితా నుంచి 5 రకాల అధ్యయన నివేదికలను ఇక సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
తాము సూచించిన అధ్యయనాలను సకాలంలో చేపట్టి నివేదికలను సమర్పించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ తాత్సారం చేస్తోందని తప్పుబట్టింది. ఈ మేరకు నిపుణుల కమిటీ సభ్య కార్యదర్శి/ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్ గత నెల 29న ఎన్డీఎస్‌ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు తన అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ తాత్సారం వల్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తాము తుది నివేదిక సమర్పించేందుకు మరింత ఆలస్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపై మిగిలిన నివేదికలైనా సకాలంలో సమర్పించేలా తెలంగాణ నీటిపారుదల శాఖపై ఒత్తిడి తేవాలని ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను అయ్యర్ ఈ నెల 2న నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపారు. సత్వరమే కోరిన సమాచారాన్ని అందజేయాలని సూచించారు.
డిసెంబర్ 31లోగా తుది నివేదిక అనుమానమే
గత వానాకాలానికి ముందు బరాజ్‌లకు నిర్వహించాల్సిన తాత్కాలిక మరమ్మతులతోపాటు వాటిలోని లోపాలను గుర్తించడానికి చేపట్టాల్సిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్దేశిస్తూ ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఏప్రిల్ 30న మధ్యంతర నివేదికను ఎన్డీఎస్‌ఏకు సమర్పించింది. బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అధ్యయనాలు అత్యవసరమని అప్పట్లో తెలిపింది. అయితే వానాకాలంలోగా నీటిపారుదల శాఖ ఆయా అధ్యయనాలను చేపట్టి నివేదించకపోవడంతో నిపుణుల కమిటీ తుది సిఫార్సుల గడువును అక్టోబర్ 31 నుంచి ఎన్డీఎస్‌ఏ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తుది నివేదిక సమర్పించే అంశంపై నిపుణుల కమిటీ పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment