
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ సంపూర్ణ ప్రక్షాళన దిశగా పూర్తి చేసిన కసరత్తు, దాని అవసరంపై అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయనున్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటివనరులు, ఐడీసీ పథకాల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ పూర్తి చేసిన పునర్‌వ్యవస్థీకరణపై సమగ్రంగా వివరించనున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన, దీనిపై చర్చ అనంతరమే పునర్‌వ్యవస్థీకరణ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రకటన సందర్భంగానే కొత్త పోస్టులు, నియామకాలపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పని విభజన పూర్తి..
రాష్ట్రంలో సాగునీటి వనరుల కింద ప్రస్తుతం 71 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి రావడం, మరో 54 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా నిర్వహణ, పక్కాగా నీటి పంపకం ఉండాలన్నా ఇరిగేషన్ శాఖలో పని విభజన జరగాలని సీఎం కేసీఆర్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక్క సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాల్వ లు, సబ్‌స్టేషన్లు ఉండేలా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ కసరత్తు పూర్తి చేశారు. ప్రాజెక్టులు, కాల్వ లు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున ప్రస్తుతం ఉన్న 13 చీఫ్ ఇంజనీర్ల డివిజన్లను 19కి పెంచేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఒక్కో సీఈ పరిధిలో 5 లక్షల ఎకరాల నుంచి 7 లక్షల ఎకరాలు ఉండేలా పని విభజన చేశారు. మైనర్ ఇరిగేషన్, ఐడీసీని పూర్తిగా తొలగించారు. ఈ పునర్‌వ్యవస్థీకరణపై కేబినెట్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. అయితే అంతకుముందే దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేసి చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ప్రభుత్వపరంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
నియామకాలపైనా స్పష్టత..
పునర్‌వ్యవస్థీకరణపై ప్రకటన సందర్భంగానే సాగునీటి శాఖ పరిధిలో కొత్త పోస్టులు, నియామకాలు, పదోన్నతులపైనా స్పష్టత రానుంది. 774 కొత్త పోస్టులు అవసరమని ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో 576 ఏఈ పోస్టులు, మరో 198 పోస్టులను పదోన్నతుల ద్వా రా భర్తీ చేయాలని ప్రతిపాదించారు. దీంతోపాటే ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు నీటి సరఫరా పక్కా గా ఉండాలన్నా... బ్యారేజీలు, రిజర్వాయర్‌లు, హెడ్ రెగ్యులేటరీల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, తూముల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు తగినంత సిబ్బంది అవసరం ఉంది. గేట్లు ఎత్తేది మొదలు కాల్వల్లో చివరి ఆయకట్టుకు నీరు చేరే వరకు వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఆపరేటర్లు, ఫిట్టర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్ల అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి సిబ్బంది 5,280 మంది అవసరం కాగా ప్రస్తుతం 1,150 మందే ఉన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల రిజర్వాయర్‌లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు అందుబాటులోకి వస్తుండటంతో ఈ సంఖ్య ఏమాత్రం సరిపోవట్లేదు. ముఖ్యంగా కాల్వ ల నిర్వహణలో కీలకమైన లష్కర్లు 3,293 మందికిగాను కేవలం 419 మందే ఉన్నారు. ఫ్లడ్ గేట్ ఆపరేటర్లు 97 మంది అవసరంకాగా 18 మందితో నెట్టుకొస్తున్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్లు 728 మందికిగాను 196 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిపైనా అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
నేడు మంత్రివర్గ భేటీ
►కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు లభించనున్న ఆమోదముద్ర
►మంత్రిమండలి ముందు మరికొన్ని కీలక బిల్లులు..
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతో పాటు పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు సీఎం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లలో కోతల విధింపు చట్టం బిల్లు, వైద్య అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు చట్ట సవరణ బిల్లు, జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లుతో పాటు ఇతర ప్రతిపాదిత బిల్లులపై ఇందులో చర్చించి ఆమోదించే అవకాశముంది. ఇటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయనుంది. అలాగే కరోనా వ్యాప్తి నివారణ, వైద్య సదుపాయం, వర్షాలతో పంటనష్టం, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, ఏపీతో జల వివాదాలు తదితర అంశాలు సభలో చర్చకు వస్తే అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment