పిచ్చాటూరు అరణియార్ గేట్ల వద్ద ప్రకృతి అందాలు
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లాలో ఉన్న అరణియార్ పర్యాటకానికి మహర్దశ కలగనుంది. ప్రాజెక్టు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తుడాతో పాటు పర్యాటక శాఖకు గత ఏడాది ప్రతిపాదనలు అందాయి. అంతే వేగంగా స్పందించిన తుడా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 3న తుడా వీసీ హరికృష్ణ అరణియార్‌ను సందర్శించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక శాఖకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అరణియార్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వద్ద జైకా నిధులు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నిధుల మంజూరులో తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కృషి, చొరవ ప్రశంసనీయమైనది.
అరణియార్ వద్ద చేపట్టనున్న పనులు
తుడా అందించే నిధులతో అరణియార్ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్ నిర్మించనున్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటల శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్స్ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌కు అనువుగా పచ్చిక మైదానాలు నిర్మించనున్నారు.
పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు గతంలో షూటింగ్ స్పాట్‌గా పేరొందింది. ఇక్కడ సుమారు 20 సినిమాలకు పైగా చిత్రీకరణ సాగింది. అందులో ప్రధానంగా జానకిరాముడు, ప్రేమదేశం, అన్నకిళి, టూటౌన్ రౌడీ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతోపాటు వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. తెలుగు, తమిళం సినిమాల్లోని పాటల చిత్రీకరణకు ఇది చాలా అనువైన ప్రదేశంగా నిలిచింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు చిత్రీకరించేవారు. నాగమ్మ టీవీ సీరియల్ 80 శాతం ఇక్కడే రూపుదిద్దుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, రాధ వంటి మన తెలుగు హీరో, హీరోయిన్లు ఎందరో ఇక్కడ చిత్రీకరణలో సందడి చేసినవారే.
అతి సుందరమైన ప్రదేశం
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహా నగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం బహుసుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు అరణియార్ వద్ద సేద తీరేవారు. ఇక్కడ ప్రకతి అందాలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి.
ఇక్కడ ఆకట్టుకునే ఉద్యానవనం ఉండడంతో వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. అయితే 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ఇన్నేళ్లకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అరణియార్ సుందరీకరణకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరణియార్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఎంపీని కలిసి నిధుల మంజూరుకు చొరవ చూపాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment