గద్వాల ఇరిగేషన్ శాఖ విభాగం–4 కార్యాలయం
గద్వాల క్రైం: గద్వాల ఇరిగేషన్‌శాఖ విభాగం–4లో గత ఏప్రిల్ 12న సీపీఎస్ నిధుల కాజేత వ్యవహారంపై పే అండ్ అంకౌట్ అధికారి, సిబ్బంది పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అయితే ఈ కేసు విచారణలో మాత్రం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర పీఓ (పెన్షన్ కార్యాలయం) జాయింట్ డైరెక్టర్ శైలజారెడ్డి గద్వాల ఇరిగేషన్‌శాఖ విభాగం– 4 కార్యాలయంలో రహస్య విచారణ చేపట్టి సిబ్బందితో మాట్లాడారు.
సిబ్బంది వ్యక్తిగత యూసర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు, హైదరాబాద్ కార్యాలయం యూసర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను టైపిస్టు జహంగీర్ ఎవరి ప్రమేయంతో తెలుసుకున్నాడు? సహకరించిన ఉదోగ్యి ఎవరు? ఈ శాఖలో కొలువు ఎలా వచ్చింది? కారుణ్య నియామకమా.. రాత పరీక్షల ద్వారా ఎంపిక అయ్యాడా? సర్వీసు బుక్ తదితర సమాచారంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సీపీఎస్ నిధులు, ఇతరత్రా ప్రభుత్వ బిల్లులు సైతం కాజేశాడా? పలు విషయాలపై కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రూ.16, 83,130 నిధులు ఎవరి ఖాతాలోకి మళ్లించాడు. ఆ ఖాతాదారులెవరు? కాజేసిన సీపీఎస్ నిధులతో ఏం చేశాడు? కేసు నమోదైనప్పటి నుంచి పోలీసుశాఖ గుర్తించిన విషయాలు తదితర అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. జేడీ వచ్చిన విషయాన్ని ఇక్కడి సిబ్బంది బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా గద్వాల ఇరిగేషన్ శాఖలో నాలుగు విభాగాల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సీపీఎస్ నిధుల విషయమై పూర్తి నివేదికను సీఈ రఘునాథ్‌రావును అడిగినట్లు సమాచారం.
దళారులతో రాజీ..
12వ తేదీ ఫిర్యాదు అయినప్పటి నుంచి టైపిస్టు జహంగీర్ పలువురు దళారులతో రాజీకి తీవ్రంగా మంతనాలు చేస్తునట్లు తెలిసింది. ఎలాంటి కేసు లేకుండా చూడాల్సిందిగా వేడుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మంత్రితో తనను ఈ గండం నుంచి గట్టెక్కించాలని ప్రాధేయపడినట్లు తెలిసింది. తగిన నజరానా సైతం ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడని తెలిసింది. అయితే సదరు మంత్రి సైతం కేసు వ్యవహారంపై స్థానిక ఓ నాయకుడితో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చూడాల్సిందిగా చెప్పినట్లు తెలిసింది. ఇక కేసు విచారణ సైతం పారదర్శకంగా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిబ్బంది మాత్రం ఇక్కడి తీరు పై ఆక్రోశంగా ఉన్నారు. ఉదోగ్య సంఘాల నాయకులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమి టని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు కలెక్టర్ సైతం స్పందించకపోవడం, పోలీసులు ఈ వ్యవహారంలో జాప్యం చేయడంపై పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ విభాగం–4 అధికారి శ్రీనివాసులును వివరణ కోరగా, జేడీ వచ్చిన మాట వాస్తవామే అన్నారు. పలు విషయాలపై సిబ్బందితో మాట్లాడారని, వ్యవహారం ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉందని తెలిపారు. సిబ్బందికి జరిగిన మోసంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment