
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు– మహబూబ్‌నగర్), (పురుషులు–నాగర్‌కర్నూల్)లలో విద్యార్థులకు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని టీడబ్ల్యూ గురుకులం మహబూబ్‌నగర్ రీజియన్ కో–ఆర్డినేటర్ పీఎస్ కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీలో నాలుగు, ఫిజిక్స్‌లో రెండు, హిస్టరీ, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే ఆయా సబ్జెక్టులలో సెట్, నెట్, పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 16వ తేదీలోగా మహబూబ్‌నగర్ శివారు తిరుమల హిల్స్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (మహిళలు) ప్రిన్సిపాల్‌కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే కళాశాలలో నిర్వహించే డెమోకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.7901097704, 9848616564లను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు.
ఈద్గానిపల్లి గ్రామాన్ని
ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రతి గ్రామం ఈద్గానిపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. రాజాపూర్ మండలం ఈద్గానిపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో రూ.4 లక్షల చెక్కును ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల భద్రతను పెంపొందించుకోవడానికి, గ్రామంలో శాంతి భద్రతలను మెరుగుపరుచుకోవడానికి, దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలను అరికట్టడానికి గ్రామస్తులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, రాజాపూర్ ఎస్‌ఐ శివానందంగౌడ్, గ్రామ పెద్దలు పంభాక్షరి, నరేందర్‌రెడ్డి, బాలగౌడ్, శ్రీనివాసులు, జగన్‌మోహన్‌రెడ్డి, రఘువీరారెడ్డి, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
బెట్టింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తాం
జిల్లాలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ ఆడినా, వాటిని ప్రోత్సాహించిన వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని ఎస్పీ డి.జానకి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఈజీమనీ కోసం యువత అలవాటుపడి అధికంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని, దీనివల్ల బంగారు భవిష్యత్ అంధకారంగా మారుతుందని పేర్కొన్నారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు. బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే 8712659360 నంబర్‌కు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు.
బడ్జెట్‌లో క్రీడల అభివృద్ధికి రూ.465 కోట్లు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.465 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జితేందర్‌రెడ్డి నివాసంలో బుధవారం లాక్రోస్ క్రీడాకారులు, రాష్ట్ర సంఘం ప్రతినిధులు ఆయనను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో మరుగున పడిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. యువత మాదక ద్రవ్యాల వైపు మరలకుండా ఏదో ఓ క్రీడలో పాలుపంచుకోవాలని సూచించారు. లాక్రోస్ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి పరిచి గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. లాక్రోస్ క్రీడ అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముఖ్య క్రీడగా ఉందని, ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని లాక్రోస్ ఇండియా టీమ్ కెప్టెన్ అనుదీప్‌రెడ్డి తెలిపారు. త్వరలో ఆగ్రాలో లాక్రోస్ క్రీడ నేషనల్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ లాక్రోస్ అకాడమీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోచ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం