
అంబేడ్కర్‌ను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌దే
పాలమూరు: కాంగ్రెస్ పార్టీ అడుగడున అంబేడ్కర్‌ను మోసం చేసిందని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రచయిత, ఆర్థికవేత్త అయిన అలాంటి వ్యక్తిని అవమానించిన ఘనత ఆ ఒక్క పార్టీకే దక్కుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మేధావుల సదస్సులో ఎంపీ మాట్లాడారు. అంబేడ్కర్ చరిత్ర తెలియని వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంబేడ్కర్‌ను ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు 74 సార్లు రాజ్యాంగ సవరణ చేసిందని, మరో 88 సార్లు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. 1952లో లోక్‌సభ ఎన్నికల్లో అంబేడ్కర్‌ను పనిగట్టుకుని ఓడించిందన్నారు. ఆయన అంత్యక్రియలకు ఢిల్లీలో స్థలం కూడా ఇవ్వలేదని, మృతదేహన్ని పంపిన విమాన చార్జీలు కూడా చెల్లించాలని బిల్లు పంపిందన్నారు. బీజేపీ అంబేడ్కర్‌ను గౌరవించుకోవడానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, కిరణ్,రమేష్, సునీల్, అనంతరెడ్డి, శ్రీకాంత్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.