మహిళల చేతికి ప్రగతి చక్రాలు | - | Sakshi
Sakshi News home page

మహిళల చేతికి ప్రగతి చక్రాలు

Published Wed, Apr 16 2025 11:18 AM | Last Updated on Wed, Apr 16 2025 11:18 AM

మహిళల చేతికి ప్రగతి చక్రాలు

మహిళల చేతికి ప్రగతి చక్రాలు

అచ్చంపేట: మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో మొత్తం ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేట 5, కల్వకుర్తి 4, నాగర్‌కర్నూల్‌ 2, కొల్లాపూర్‌ 2, గద్వాల 4, వనపర్తి 7, మహబూబ్‌నగర్‌ 5, నారాయణపేట 2, కోస్గి 1, షాద్‌నగర్‌ 17 చొప్పున 49 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసరమయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ– సేవ కేంద్రాలు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది.

రద్దీ నేపథ్యంలో 64 కొత్త బస్సుల కోసం..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ల కిందటివి కావడంతో తరుచుగా మరమ్మతుకు గురవుతున్నాయి. పండుగలు, జాతర్లు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్‌భవన్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బస్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేటకు (2 ఎక్స్‌ప్రెస్‌లు), కల్వకుర్తికి (2 ఎక్స్‌ప్రెస్‌లు) నాగర్‌కర్నూల్‌కు (3 పల్లె వెలుగులు), గద్వాలకు (7 ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లె వెలుగులు, 2 డీలక్స్‌లు), వనపర్తికి (4 ఎక్స్‌ప్రెస్‌లు, 4 పల్లె వెలుగులు), మహబూబ్‌నగర్‌కు (11 ఎక్స్‌ప్రెస్‌లు, 6 పల్లె వెలుగులు), నారాయణపేటకు (1 ఎక్స్‌ప్రెస్‌, 1 పల్లెవెలుగు), షాద్‌నగర్‌కు (6 ఎక్స్‌ప్రెస్‌లు, 3 పల్లె వెలుగులు) చొప్పున మొత్తం 64 బస్సుల కోసం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి.

అద్దె ప్రాతిపదికన

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకై నా సమస్య తీరనుంది. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.77,220 అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్య సొంతం కానుంది.

మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు

ఉమ్మడి జిల్లాలో 49 బస్సుల కోసం ప్రతిపాదనలు

ప్రతినెలా ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లింపు

మహిళలూ ఆర్థిక పరిపుష్టి సాధించే సదావకాశం

ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చేయూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement