డెడ్‌స్టోరేజీకి చేరుకుంటున్న కడెం ప్రాజెక్టు నీటిమట్టం
సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వరదలు పోటెత్తడంతో కుదేలైన కడెం ప్రాజెక్టును ఆధునీకరించాలని నీటిపారుదల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాజెక్టు గరిష్ట నీటి విడుదల సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులుకాగా.. ఈ నెల 13న అర్ధరాత్రి 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంత వరదను కిందికి వదిలేందుకు వీల్లేకపోవడంతో.. నిల్వ సామర్థ్యానికి మించి నీరు చేరి ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఎడమవైపు స్పిల్‌వేకు గండిపడి వరద వెళ్లేందుకు మరో మార్గం ఏర్పడటంతో ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గి ప్రమాదం తప్పింది. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా.. వరదల సమయంలో ఓ గేటు మొరాయించింది. మిగతా 17 గేట్లను ఎత్తగలిగారు. వరద తగ్గాక తిరిగి గేట్లను కిందికి దించడానికి ప్రాజెక్టు ఇంజనీర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
వరదతోపాటు కొట్టుకువచ్చిన చెట్ల కొమ్మలు, వ్యర్థాలు, బురదతో గేట్లను ఎత్తే పరికరాల గదులు నిండిపోవడం, గేట్లను ఎత్తే రోలర్లు, విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఇక రెండు గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్స్ కొట్టుకుపోవడంతో.. ఆ గేట్లను కిందికి దించే పరిస్థితి లేదు. ఒకవేళ కిందికి దించగలిగినా.. మళ్లీ పైకి ఎత్తడం సాధ్యం కాదు. ఈ సమస్యలన్నింటి నేపథ్యంలో ప్రస్తుతానికి గేట్లను దించకుండా ప్రాజెక్టును ఖాళీ కానివ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన కడెం ప్రాజెక్టు కింద 1.74 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
5 లక్షల క్యూసెక్కులను వదలగలిగేలా..
కడెం ప్రాజెక్టును నిజాం కాలంలో 1.3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో నిర్మించారు. 1952లో 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో 3 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగలిగేలా అప్పట్లో 8 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత వరదలతో నీటి విడుదల సామర్థ్యాన్ని 5 లక్షల క్యూసెక్కులకుపైగా పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 18 గేట్లలో 9 జర్మన్ గేట్లు ఉన్నాయి. వాటిని తొలగించి కొత్తగా క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదనంగా ప్రాజెక్టుకు రెండు వైపులా చెరో నాలుగు కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోమవారం ఇంజనీరింగ్ నిపుణులు కడెం ప్రాజెక్టును సందర్శించి.. ఆధునీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఈ పనుల పూర్తికి కనీసం ఏడాది పట్టొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. అప్పటిలోగా ప్రాజెక్టును ఖాళీగానే ఉంచే అవకాశాలు ఉన్నాయి.
డెడ్ స్టోరేజీకి కడెం
నిర్మల్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడం, ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతుండడంతో కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులకుగాను.. ఇప్పుడు 678 అడుగులకు పడిపోయింది. మరో మూడు అడుగులు.. అంటే 675 అడుగులకు తగ్గితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది. నీటి నిల్వ కూడా 7.603 టీఎంసీల సామర్థ్యానికిగాను శనివారం సాయంత్రానికి 3 టీఎంసీలకు తగ్గింది. భారీ వరదలకు కొట్టుకొచ్చిన దుంగలు, చెట్ల కొమ్మలతో ప్రాజెక్టు దెబ్బతిన్నదని, ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.8 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. నీటిమట్టం పూర్తిగా తగ్గితే.. ప్రాజెక్టులో కింది వరకు నష్టం వివరాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ప్రాజెక్టు మొత్తంగా ఖాళీ అవుతుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment