Kadem project gates
-
కడెంకు సీడబ్ల్యూసీ బృందం రాక
కడెం: కడెం ప్రాజెక్టు రక్షణపై సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) దృష్టి సారించింది. గతేడాది, ఈఏడాది ఎగువ నుంచి వరదనీరు వస్తున్న సమయంలో ప్రాజెక్టు గేట్లు తరచు మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు, సీడబ్ల్యూసీ బృందం ఈనెల 27, 28, 29 తేదీ ల్లో వస్తున్నట్టు సమాచారం. కడెం ప్రాజెక్టు నిర్మాణం 65 ఏళ్ల క్రితం జరిగింది. ప్రస్తుతం డ్యాం సేఫ్టీ, వరద గేట్ల పనితీరు, ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం, ఔట్‌ఫ్లో కెపాసిటీ, ప్రాజెక్ట్ నిర్వహణ తదితరాలను బృందం పరిశీలిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సీడబ్ల్యూసీ బృందం వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రాజెక్టు వరద గేట్లు, ఇతర మరమ్మతులు చకచకా చేస్తున్నారు. అదనపు గేట్ల ఏర్పాటుపై... కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువకు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ రూపొందించారు. అయితే గతేడాది 6 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో రాగా, గేట్ల పైనుంచి వరద వెళ్లింది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం పెంచేలా కడెం ప్రాజెక్టు మొదటి గేటు పక్క నుంచి పాత జనరేటర్ గదివైపు ఐదు అదనపు గేట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది. అదనపు గేట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సీడబ్ల్యూసీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. -
Kadem Project: ఉన్న గేట్లు మార్చి.. కొత్త గేట్లు కట్టి..!
సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వరదలు పోటెత్తడంతో కుదేలైన కడెం ప్రాజెక్టును ఆధునీకరించాలని నీటిపారుదల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాజెక్టు గరిష్ట నీటి విడుదల సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులుకాగా.. ఈ నెల 13న అర్ధరాత్రి 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంత వరదను కిందికి వదిలేందుకు వీల్లేకపోవడంతో.. నిల్వ సామర్థ్యానికి మించి నీరు చేరి ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఎడమవైపు స్పిల్‌వేకు గండిపడి వరద వెళ్లేందుకు మరో మార్గం ఏర్పడటంతో ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గి ప్రమాదం తప్పింది. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా.. వరదల సమయంలో ఓ గేటు మొరాయించింది. మిగతా 17 గేట్లను ఎత్తగలిగారు. వరద తగ్గాక తిరిగి గేట్లను కిందికి దించడానికి ప్రాజెక్టు ఇంజనీర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరదతోపాటు కొట్టుకువచ్చిన చెట్ల కొమ్మలు, వ్యర్థాలు, బురదతో గేట్లను ఎత్తే పరికరాల గదులు నిండిపోవడం, గేట్లను ఎత్తే రోలర్లు, విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఇక రెండు గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్స్ కొట్టుకుపోవడంతో.. ఆ గేట్లను కిందికి దించే పరిస్థితి లేదు. ఒకవేళ కిందికి దించగలిగినా.. మళ్లీ పైకి ఎత్తడం సాధ్యం కాదు. ఈ సమస్యలన్నింటి నేపథ్యంలో ప్రస్తుతానికి గేట్లను దించకుండా ప్రాజెక్టును ఖాళీ కానివ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన కడెం ప్రాజెక్టు కింద 1.74 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 5 లక్షల క్యూసెక్కులను వదలగలిగేలా.. కడెం ప్రాజెక్టును నిజాం కాలంలో 1.3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో నిర్మించారు. 1952లో 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో 3 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగలిగేలా అప్పట్లో 8 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత వరదలతో నీటి విడుదల సామర్థ్యాన్ని 5 లక్షల క్యూసెక్కులకుపైగా పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 18 గేట్లలో 9 జర్మన్ గేట్లు ఉన్నాయి. వాటిని తొలగించి కొత్తగా క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదనంగా ప్రాజెక్టుకు రెండు వైపులా చెరో నాలుగు కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోమవారం ఇంజనీరింగ్ నిపుణులు కడెం ప్రాజెక్టును సందర్శించి.. ఆధునీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఈ పనుల పూర్తికి కనీసం ఏడాది పట్టొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. అప్పటిలోగా ప్రాజెక్టును ఖాళీగానే ఉంచే అవకాశాలు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి కడెం నిర్మల్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడం, ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతుండడంతో కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులకుగాను.. ఇప్పుడు 678 అడుగులకు పడిపోయింది. మరో మూడు అడుగులు.. అంటే 675 అడుగులకు తగ్గితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది. నీటి నిల్వ కూడా 7.603 టీఎంసీల సామర్థ్యానికిగాను శనివారం సాయంత్రానికి 3 టీఎంసీలకు తగ్గింది. భారీ వరదలకు కొట్టుకొచ్చిన దుంగలు, చెట్ల కొమ్మలతో ప్రాజెక్టు దెబ్బతిన్నదని, ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.8 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. నీటిమట్టం పూర్తిగా తగ్గితే.. ప్రాజెక్టులో కింది వరకు నష్టం వివరాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ప్రాజెక్టు మొత్తంగా ఖాళీ అవుతుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. -
వలలు మింగిన వరదగోదారి
- ఉపాధి కోల్పోయిన 500 మంది గంగపుత్రులు - ఆర్థికసాయం అందించాలని విన్నపం వెల్గటూరు : ఉరకలెత్తిన ఉగ్ర గోదావరి మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసింది. పోటెత్తిన వరదనీటి ఉధృతిలో చేపల కోసం గంగపుత్రులు వేసిన వలలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో వందలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వారం క్రితం గోదావరి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు తోడు కడెంప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి పరుగులు పెట్టింది. రాత్రికిరాత్రి వరద ఉధృతి పెరిగి ఖచ్చువలలన్ని కొట్టుకుపోయి తీవ్ర నష్టం మిగిలింది. చేపల వేటతోనే ఉపాధి ఎల్లంపెల్లి నిర్మాణంతో ఈప్రాంత ప్రజలకు చేకూరిన తక్షణ ప్రయోజనమేదైనా చేకూరిందంటే.. అది చేపల వేటతో ఉపాధి పొందడమనే చెప్పాలి. వెల్గటూరు, రాజక్కపల్లి, కప్పారావుపేట, శాఖాపూర్, ముక్కట్రావుపేట, రాంనూరు, కిషన్రావుపేట, జగదేవుపేట, కొండాపూర్, చెగ్యాం, తాళ్లకొత్తపేట, ఉండెడ గ్రామాల నుంచి దాదాపు ఐదువందల కుటుంబాలు ఎల్లంపల్లి మిగులుజాల్లో చేపల వేటతోనే ఉపాధి పొందుతున్నాయి. గతంలో ఉపాధి కోసం బొంబాయి, బివండీ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వీరు ఇప్పుడు చేపల వేటతో అక్కడే ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. రోజుకు ఐదువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతూ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ సమయంలో జరిగిన నష్టంతో వారు ఆవేదన చెందుతున్నారు. కొత్త వలల కొనుగోలుకు అప్పులు చేపల వేటతోనే జీవనం సాగించే మత్స్యకారులకు వలలతోనే జీవనోపాధి. వరదలో వలలన్నీ కొట్టుకుపోవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. ఒక్కో వల దాదాపు రెండువేల రూపాయల ఖరీదు చేస్తుంది. దీనికి తోడు రవాణా ఖర్చుల భారం మోయాలి. వరదలో పది వలలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తిరిగి కొత్తవలలు కొనుగోలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు కొందరు మత్స్యకారులు శుక్రవారం తరలివెళ్లారు. తొలి ఏకాదశి పండుగ వారికి బస్సులోనే గడిచింది. ఉపాధి దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మత్స్యకారులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఉపాధికి కనీస అవసరాలైన వలలను కూడా ఫిషరీస్ సంస్థ తరఫున ప్రభుత్వం అందించడం లేదని వాపోయారు. యాభై ఏళ్లు నిండిన వారికి పింఛనుతో పాటు ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని కోరారు. మర పడవలు కొనుగోలుకు రుణాలు అందించాలన్నారు. ఆర్థిక సాయం అందించాలి చేపలు పట్టుకోవడమే మాకు బతుకుదెరువు. కష్టపడి కొనుక్కున్న ఆరు వలలు వరదలో కొట్టుకుపోయాయి. కొత్తవలలు కొందామంటే చేతిలో డబ్బుల్లేవు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి. - బోరె రవి, చెగ్యాం