వలలు మింగిన వరదగోదారి
- ఉపాధి కోల్పోయిన 500 మంది గంగపుత్రులు
- ఆర్థికసాయం అందించాలని విన్నపం
వెల్గటూరు : ఉరకలెత్తిన ఉగ్ర గోదావరి మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసింది. పోటెత్తిన వరదనీటి ఉధృతిలో చేపల కోసం గంగపుత్రులు వేసిన వలలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో వందలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వారం క్రితం గోదావరి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు తోడు కడెంప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి పరుగులు పెట్టింది. రాత్రికిరాత్రి వరద ఉధృతి పెరిగి ఖచ్చువలలన్ని కొట్టుకుపోయి తీవ్ర నష్టం మిగిలింది.
చేపల వేటతోనే ఉపాధి
ఎల్లంపెల్లి నిర్మాణంతో ఈప్రాంత ప్రజలకు చేకూరిన తక్షణ ప్రయోజనమేదైనా చేకూరిందంటే.. అది చేపల వేటతో ఉపాధి పొందడమనే చెప్పాలి. వెల్గటూరు, రాజక్కపల్లి, కప్పారావుపేట, శాఖాపూర్, ముక్కట్రావుపేట, రాంనూరు, కిషన్‌రావుపేట, జగదేవుపేట, కొండాపూర్, చెగ్యాం, తాళ్లకొత్తపేట, ఉండెడ గ్రామాల నుంచి దాదాపు ఐదువందల కుటుంబాలు ఎల్లంపల్లి మిగులుజాల్లో చేపల వేటతోనే ఉపాధి పొందుతున్నాయి. గతంలో ఉపాధి కోసం బొంబాయి, బివండీ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వీరు ఇప్పుడు చేపల వేటతో అక్కడే ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. రోజుకు ఐదువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతూ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ సమయంలో జరిగిన నష్టంతో వారు ఆవేదన చెందుతున్నారు.
కొత్త వలల కొనుగోలుకు అప్పులు
చేపల వేటతోనే జీవనం సాగించే మత్స్యకారులకు వలలతోనే జీవనోపాధి. వరదలో వలలన్నీ కొట్టుకుపోవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. ఒక్కో వల దాదాపు రెండువేల రూపాయల ఖరీదు చేస్తుంది. దీనికి తోడు రవాణా ఖర్చుల భారం మోయాలి. వరదలో పది వలలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తిరిగి కొత్తవలలు కొనుగోలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు కొందరు మత్స్యకారులు శుక్రవారం తరలివెళ్లారు. తొలి ఏకాదశి పండుగ వారికి బస్సులోనే గడిచింది. ఉపాధి దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మత్స్యకారులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఉపాధికి కనీస అవసరాలైన వలలను కూడా ఫిషరీస్ సంస్థ తరఫున ప్రభుత్వం అందించడం లేదని వాపోయారు. యాభై ఏళ్లు నిండిన వారికి పింఛనుతో పాటు ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని కోరారు. మర పడవలు కొనుగోలుకు రుణాలు అందించాలన్నారు.
ఆర్థిక సాయం అందించాలి
చేపలు పట్టుకోవడమే మాకు బతుకుదెరువు. కష్టపడి కొనుక్కున్న ఆరు వలలు వరదలో కొట్టుకుపోయాయి. కొత్తవలలు కొందామంటే చేతిలో డబ్బుల్లేవు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి.
- బోరె రవి, చెగ్యాం