‘పవర్‌’కు పంప్‌హౌస్‌లు | CM KCR Says Irrigation Department To Merge Under Water Resources Department | Sakshi
Sakshi News home page

‘పవర్‌’కు పంప్‌హౌస్‌లు

Published Tue, Jul 21 2020 1:24 AM | Last Updated on Tue, Jul 21 2020 7:46 AM

CM KCR Says Irrigation Department To Merge Under Water Resources Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని చెప్పారు. అవసరమైతే వెయ్యి కొత్త పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. నీటి పారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్‌ రిసో ర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌)గా మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఎత్తిపోతల పథకాల అన్ని పంప్‌హౌస్‌ల నిర్వహణను విద్యుత్‌ శాఖకు అప్పగించా లని సీఎం కీలక సూచన చేశారు. జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థితికి తగ్గట్టుగా జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదాను సీఎంకు అందిం చారు. ఈ ముసాయిదాపై సీఎం చర్చించారు. మొత్తంగా గోదావరి నుంచి ప్రతిరోజూ 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు లిఫ్టు చేసి, రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సీఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచిం చారు. ముసాయిదాకు కొన్ని మార్పులు చెప్పారు. అధికారులు మరోసారి వర్క్‌షాపు నిర్వహించుకుని సూచించిన మార్పులకు అనుగుణంగా పునర్వ్యవసీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్‌ సీలు మురళీధర్‌రావు, నాగేందర్‌రావు, అనిల్‌ కుమార్, వెంకటేశ్వర్లు, హరేరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, పలువురు సీఈలు  పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఎంతో వ్యయంతో, ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అలా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. దీనికి తగ్గట్టుగా జల వనరుల శాఖ సంసిద్ధం కావాలి. 
జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలి. ఇఇలు, డిఇల పరిధిలను ఖరారు చేయాలి. ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్‌ డ్యాములు, సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి.
సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో ఖచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున, సీఈ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కావాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి.
పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఈఎన్‌సి నుంచి లష్కరు వరకు ఎంతమంది సిబ్బంది కావాలి? ప్రస్తుత ఎంతమంది ఉన్నారు? అనే విషయాల్లో వాస్తవిక అంచనాలు వేయాలి. ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఈఎన్‌సిలు ఉండాలనే విషయం నిర్ధారించాలి. ఈఎస్‌సి జనరల్, ఈఎస్‌సి అడ్మినిస్ట్రేషన్, ఈఎస్‌సి ఆపరేషన్స్‌ కూడా ఖచ్చితంగా ఉండాలి. 
ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఇలా ప్రతీచోటా ఖచ్చితంగా ఆపరేషన్‌ మాన్యువల్స్‌ రూపొందించాలి. దానికి అనుగుణంగానే నిర్వహణ జరగాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలి. 
అన్ని పంప్‌ హౌజుల నిర్వహణ బాధ్యత విద్యుత్‌ శాఖకు అప్పగించాలి
ఉపాధి హామీ పథకం ద్వారా సాగునీటి రంగంలో ఏఏ పనులు చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాలి.
ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్టు హౌజులు నిర్మించాలి. సీఈలకు తమ పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement