సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరదల వేళ ముందస్తుగా చేస్తున్న హెచ్చరికలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హెచ్చరికల ఆధారంగానే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన గోదావరి నదికి జూలై నెలలో వచ్చే వరదలు సాధారణంగా పెద్దగా ప్రభావం చూపవు.
చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్
అందుకు భిన్నంగా ఈసారి గోదావరి మహోగ్రరూపమెత్తి ప్రజలను భయపెడుతోంది. ఎగువన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉప నదులైన మంజీరా, ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, పెన్‌గంగ వంటివి పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరంతా చేరడంతో గోదావరి కూడా ఉప్పొంగిపోతోంది.
మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గత ఎనిమిది రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. శనివారం నాటికి కాటన్ బ్యారేజీ వద్దకు 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. ఆదివారం నిలకడగా ఉన్నప్పటికీ దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ..
ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో వరద ప్రమాద హెచ్చరికలు ఎంతో తోడ్పడుతున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం వద్ద 1847 – 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ పాలకులు 1855లో రివర్ కన్జర్వెన్సీ చట్టం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని ఆధారంగానే వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ నీటి ప్రవాహాలను అధికారికంగా గంటగంటకూ ప్రకటిస్తూంటారు. గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూంటారు. వీటి ఆధారంగానే బ్యారేజీకి దిగువన ప్రజలను అప్రమత్తం చేస్తారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియ బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ జరుగుతోంది.
మొదటి ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా హెడ్ వర్క్స్ ఈఈ వ్యవహరిస్తారు. గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. శాశ్వత, తాత్కాలిక ఫ్లడ్ స్టోర్స్‌లో సామగ్రిని చెక్ చేసుకుంటారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంటారు.
రెండో ప్రమాద హెచ్చరిక
బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను విడుదల చేస్తారు. బ్యారేజీ దిగువన ఉన్న వందలాది లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలి.
మూడో ప్రమాద హెచ్చరిక
బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 17.50 లక్షలు ఆపైన వచ్చిన మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే బ్యారేజీ దిగువన గోదావరి లంకలు నీట మునుగుతాయి. ఈ హెచ్చరిక ప్రకటించిన వెంటనే ఫ్లడ్ డ్యూటీ అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో 24 గంటలూ డ్యూటీ నిర్వహించాలి. గోదావరిపై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వరద బాధితుల పునరావాసం, ప్రమాద నివారణ చర్యలు ఆరంభిస్తారు.
రివర్ కన్జర్వెన్సీ చట్టంతోనే..
బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ వరద ప్రమాద హెచ్చరికల జారీకి బ్రిటిష్ కాలం నాటి రివర్ కన్జర్వెన్సీ చట్టాన్నే అనుసరిస్తున్నారు. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. వీటి వల్లే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం సాధ్యమవుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను రెడ్ అలర్ట్‌గా చెప్పవచ్చు.
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, రిటైర్డ్ ఎస్‌ఈ, హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం
Comments
Please login to add a commentAdd a comment