సాక్షి అమలాపురం: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. మూడు దశల్లో కచ్చితమైన అంచనాకు వస్తుంటారు.
క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు
తొలిదశలో గోదావరి నదికి క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసే వర్షాల ఆధారంగా గోదావరికి వచ్చే వరదపై అధికారులకు అంచనా ఉంటుంది. క్యాచ్‌మెంట్ ఏరియా ఏకంగా 3,12,812 స్క్వేర్ మీటర్లు. ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో విస్తరించింది. క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాల వివరాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీబ్ల్యూసీ) పంపిస్తోంది. మహారాష్ట్రలోని క్యాచ్‌మెంట్ ప్రాంతంలో భారీగా కురిసినా నేరుగా వరద ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చే అవకాశం తక్కువ. మధ్యలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నందున ఆలస్యమవుతోంది. అదే తెలంగాణలోని వరంగల్, ఏటూరి నాగారం, మంచిర్యాలా, మణుగూరు, ఇచ్చంపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తక్కువ సమయంలోనే ధవళేశ్వరం వద్ద ఉధృతి కనిపిస్తోంది.
కాళేశ్వరం టూ ధవళేశ్వరం
క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షంతో వచ్చే అంచనాతోపాటు రెండవ దశలో గోదావరి, ఉప నదుల మీద ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్ల వద్ద రీడింగ్‌ల ద్వారా వరద అంచనా వేస్తారు. వరదపై చాలా వరకు పక్కాగా లెక్క వస్తోంది. ప్రధానంగా భద్రాచలం గేజ్ స్టేషన్ వద్ద ఉన్న నీటి పరిణామాన్ని బట్టి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం తేలుతోంది. ఆయా గేజ్ స్టేషన్ల దూరాన్ని బట్టి ధవళేశ్వరం బ్యారేజీకి వరద వచ్చేందుకు పట్టే సమయం తేలుతోంది. గోదావరిపై పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం వద్ద, కొత్తగా కాపర్‌డామ్, పోలవరం వద్ద, అలాగే ఉప నది శబరిపై కుంట, కొయిడాల వద్ద గేజ్ స్టేషన్లు ఉన్నాయి. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరద వచ్చేందుకు 18 గంటల సమయం పడుతోంది.
గేట్ల నుంచి వెళ్లే నీటి పరిమాణంతో వరద లెక్క
మూడవ దశలో వరద లెక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తేలుతోంది. బ్యారేజ్ స్పిల్ లెవిల్ మీద 10.67 స్పిల్ లెవిల్ మీద ఎంత ఎత్తున నీరు వచ్చిందో చూస్తారు. మొత్తం 175 గేట్లు ఉండగా, ఎన్ని గేట్లు ఎత్తారు, గేట్ల మధ్య పొడవు, వెడల్పును పరిగణలోకి తీసుకుని ఒక సెకనుకు ఎన్ని క్యూసెక్కులు వెళుతోంది లెక్క కడతారు.
గాంధీ గడియారం... పేపర్ బాల్స్
ఇప్పుడంటే బ్యారేజీకి వచ్చే వరదపై కచ్చితమైన అంచనాకు సాంకేతికంగా పలు పరికరాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వరద ప్రవాహాన్ని, వేగాన్ని కొలవడం అధికారులకు కత్తిమీద సామే. ఇందుకు వారు గాంధీ గడియారం, పేపర్ బాల్స్ (పేపర్లతో చుట్టిన బంతి)ని వినియోగించేవారు. ‘పేపర్‌ను ఉండగా చుట్టి బ్యారేజీ ఎగువ వైపు వేసేవాళ్లం. బ్యారేజీ దిగువకు ఎంతసేపటిలో వచ్చిందనేది తెలుసుకోవడానికి గాంధీ గడియారాన్ని ఉపయోగించేవాళ్లం. ఈ సమయాన్ని నమోదు చేయడం ద్వారా వరద వేగాన్ని గుర్తించే వాళ్లం’ అని ఇరిగేషన్ రిటైర్డ్ ఇన్‌చార్జి ఎస్‌ఈ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment