గోదావరి జిల్లాల్లో వరద భీభత్సం | Godavari Floods People Problems In Godavari Districts | Sakshi
Sakshi News home page

గోదావరి జిల్లాల్లో వరద భీభత్సం

Published Sun, Aug 4 2019 6:54 PM | Last Updated on Sun, Aug 4 2019 7:13 PM

Godavari Floods People Problems In Godavari Districts - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి : ఉభయ గోదావరి జిల్లాలు వరద ప్రభావంతో అల్లకల్లోలం అవుతున్నాయి. వదర నీరు నలువైపులనుంచి గ్రామాలను చుట్టుముడుతుండటంతో ప్రజలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో గోదావరి నదికి వరద రావడంతో లంక ప్రాంతాలలోకి నీరు చేరుకుంటోంది. వరదల ప్రభావంతో లంక ప్రాంతాలలో కూరగాయల తోటలు, వాణిజ్య పంటలు నీట మునిగాయి. అరటి, వంగ, కంద, మునగ, పచ్చిమిర్చి, బెండ, బీర పంటలు నీట మునగడంతో రైతుల గగ్గోలు పెడుతున్నారు. సీతానగరం మండలం బొబ్బిల్లంక దగ్గర వరద ఉధృతికి గోదావరి గట్టు కోతకు గురైంది. దీంతో అధికారులు ముందస్తుగా ఇసుక బస్తాలను వేశారు. గోదావరికి ఉధృతి పెరగడంతో బొబ్బిలంక-ములకల్లంక గ్రామాల మధ్య నాటుపడవల ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద తీవ్రతని రామమండ్రి అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని గోదావరి ఏటిగట్టు కోతకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో వరద నీరు చేరింది. పల్లిపాలెంలో 63 ఇళ్లు నీట మునిగాయి. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ముంపు బాధితులు తక్షణమే పునరావాస కేంద్రాలకు రావాలని అధికారులు ఆదేశించారు.  ఆలమూరు మండలంలోని పలు లంక గ్రామాలు నీటమునిగాయి. దీంతో సహాయక కార్యక్రమాలను ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.  బడుగు వాణి లంక, తోక లంక వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించిన ఆయన.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైనచోట తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద పోటెత్తడంతో 4 నిర్వాసిత గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద చుట్టుముట్టడంతో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు అధికారులు నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంచినీటి వసతితో పాటు మెడికల్‌ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు.  అనారోగ్యంతో బాధపడేవారిని లాంచీల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వరద ముంపు ప్రభావిత లంక గ్రామాలలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్టం రాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు.  ఆచంట నియోజకవర్గంలోని పలు లంక గ్రామాల్లో  పర్యటించి అక్కడున్న ఇబ్బందులను, పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నా రు.

పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విలీనమండలాలను సైతం గోదావరి వరద వణికిస్తుంది. శబరితోపాటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. చింతూరులో వీరాపురం వాగుపొంగడంతో రహదారిపైకి వరదనీరు వచ్చి చేరింది. ఆంధ్రా-ఒడిషాల మధ్య రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిగువన గోదావరి లంకల్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. పి.గన్నవరం మండలంలో గంటి పెదపూడి వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది. కనకాయిలంక కాజ్‌వేతో పాటు సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం- అప్పనరాముని లంక మధ్యలో ఉన్న కాజ్ వే కూడా కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement