టెండర్లను ఆమోదించని కమిషన్ ఆఫ్ టెండర్స్
లక్ష ఎకరాల ఆయకట్టుకు రూ.4,350 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు
రెండు ప్యాకేజీలుగా విభజించి గతనెలలో టెండర్ల ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) ఆమోదముద్ర లభించలేదు. పలు ఇంజనీరింగ్ శాఖల పనులకు సంబంధించిన టెండర్లపై శనివారం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలోని సీఓటీ సమావేశమై చర్చించింది.
ఈ సమావేశంలో నారాయణపేట–కొడంగల్ టెండర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.4,350కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.
టెండర్ల ఆమోదంపై నిర్ణయం తీసుకోని సీఓటీ
ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి గత నెల లో టెండర్లను ఆహ్వానించారు. ప్యాకేజీ–1 కింద రూ.1,134.62 కోట్ల అంచనాలతో టెండర్లను పిల వగా, 3.9% అధిక ధరను కోట్ చేసి రాఘవ–జ్యోతి జాయింట్ వెంచర్ ఎల్–1గా నిలిచింది. 4.85% అధిక ధరను కోట్ చేసి ఎల్–2గా మేఘా ఇంజనీ రింగ్ నిలిచింది.
రూ.1,126.85 కోట్ల అంచనాలతో రెండో ప్యాకేజీ పనులకు టెండర్లను పిలవగా 3.95% అధిక ధరను కోట్ చేసి ఎల్–1గా మేఘా ఇంజనీరింగ్, 4.8% అధిక ధరను కోట్ చేసిన ఎల్–2గా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ నిలిచాయి. ఈ టెండర్లను సీఓటీ ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటికే పలుమార్లు సమావేశమైన సీఓటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది.
21న జరిగే సమావేశంలోనైనా...
ప్యాకేజీ–1 టెండర్ల విషయంలో సీఓటీలోని కొందరు చీఫ్ ఇంజనీర్లు కొన్ని అంశాలపై కొర్రీలు వేసినట్లు సమాచారం. ఈ నెల 21న జరగనున్న సీఓటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రూ.360 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులకు సీఓటీ ఆమోదముద్ర వేసింది. రూ.14 కోట్లతో చేపట్టిన సదర్మట్ బరాజ్ విద్యుదీకరణ పనులకు సైతం అనుమతిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment