సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ మళ్లీ వాయి దా పడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ గత నెల 27న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మినిట్స్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి (పర్యావరణ పునరుద్ధరణకు) రూ.142 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది.
అయితే నష్ట నివారణ వ్యయాన్ని లెక్కించడంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను నీటిపారుదల శాఖ అనుసరించలేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. పర్యావరణానికి జరిగిన నష్టం విలువ, నష్ట నివారణ చర్యల వ్యయం, సామాజిక ప్రభావ నివారణ చర్యల వ్యయాలను ఎస్‌ఓపీ ఆధారంగా మళ్లీ లెక్కించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కాగా రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు, ఇప్పటికే రూ.21,200 కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖకు తెలియజేసింది. ప్రాజెక్టు ద్వారా 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్లకు సాగునీరు అందుతుందని, సత్వరం పర్యావరణ అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
గత నవంబర్‌లోనే ఉల్లంఘనల నిర్ధారణ
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం..పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను ఉల్లంఘించినట్టు గతేడాది నవంబర్ 14న జరిగిన సమావేశంలో కమిటీ నిర్ధారించింది. వాస్తవానికి ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీ విషయంలో అనుసరించాల్సిన ఎస్‌ఓపీని 2021లో కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపాదనలను సైతం ఎస్‌ఓపీ ఆధారంగా మదింపు నిర్వహించాలని అప్పట్లో నిపుణుల కమిటీ నిర్ణయించింది. దీంతో ఎస్‌ఓపీ అమలులో భాగంగా.. అనుమతులు లేకుండా పనులు చేపట్టడంతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.6124.36 కోట్లతో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)ని సిద్ధం చేసింది. అందులో రూ.142.49 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు కేటాయించింది.
అయితే వీటిని లెక్కించే విషయంలో ఎస్‌ఓపీని పాటించలేదని నిర్ధారించిన నిపుణుల కమిటీ మళ్లీ కొత్తగా అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంపై గతంలో ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.528 కోట్లను పర్యావరణ పరిహారంగా కృష్ణా బోర్డుకు చెల్లించాలని అప్పట్లో ఆదేశాలివ్వగా దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment