సాక్షి, హైదరాబాద్ : నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేల శాసన స్వభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించాలని భావిస్తోంది. ఈ మేరకు దూకుడుగా ముందుకువెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ మంగళవారం సాయంత్రం నుంచి దీక్ష చేపట్టనున్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరిట గాంధీభవన్‌లో ఈ ఇద్దరు నేతలు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. వీరి దీక్షకు సంఘీభావంగా సీనియర్ నాయకులంతా పాల్గొననున్నారు. అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేల స్వభ్యత్వం రద్దుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, ఈ విషయంలో న్యాయపోరాటం కూడా చేయాలని భావిస్తోంది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసే అవకాశముంది. అదేవిధంగా కోమటిరెడ్డి, సంపత్‌పై చర్యలకు వ్యతిరేకంగా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ నిరసన సభలు చేపట్టాలని వ్యూహం సిద్ధంచేస్తోంది. అధిష్టానం నుంచి అనుమతి రాగానే.. ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతంగా నిర్వహించాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఆ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వేదికపైకి హెడ్‌సెట్ విసిరేయడం.. అది తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయం అయింది, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు చెందిన మొత్తం 11 మంది సభ్యులను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి శాసన మండలిలోనూ ఐదుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment