సాక్షి, తిప్పర్తి : తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పది ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు, దేశ రక్షణకు పాటుపడిన ఉత్తమ్ కుమార్‌రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.
రెండు సార్లు మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, గత ఐదేళ్ల పాలనలో దళితులకు అన్ని విధాలా అన్యాయం చేశారని విమర్శించారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ, పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరించిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే.. పేదలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment