ప్రెస్‌మీట్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభా నియమాల్ని ఉల్లఘించారనే కారణంగా ఎమ్మెల్యే పదవుల్ని కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ గురువారం పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరించి చేయని తప్పుకు తమ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారని వారు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మాకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకముంది. చేయని తప్పుకు మాకు శిక్ష విధించారు. మాకు తప్పక న్యాయం జరుగుతుంది. మా శాసన సభ్యత్వం రద్దు అంశం కోర్టు పరిధిలో ఉంది గనుక ఆ విషయంపై ఎక్కువగా మాట్లాడం’అని కోమటిరెడ్డి, సంపత్‌లు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు తనను రాజకీయంగా ఎవరూ ఏమీ చేయలేరని కోమటిరెడ్డి అన్నారు. ‘నా అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ది రాజకీయ హత్య’ అని ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. మంత్రిగా పనిచేసిన తనకు కేసీఆర్ ప్రభుత్వం కావాలనే గన్‌మెన్‌లను తొలగించిందని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. తనను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజల గుండెల్లో నాకు స్థానమున్నంత వరకు నన్నెవరూ ఏం చేయలేరు. నా ప్రాణానికి హాని జరిగితే నల్లగొండ ప్రజలు ప్రగతిభవన్‌ను నేలకూల్చి కేసీఆర్‌ను తెలంగాణ పొలిమేర దాటిస్తారని హెచ్చరించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కుటుంబానికి మూడు హత్య కేసులతో సంబంధముందని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ 6 రోజుల నుంచి ఫామ్ హౌజ్‌లో సేద తీరుతున్నాడని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment