
సాక్షి, హైదరాబాద్ : తెలుగువారి మనస్సాక్షి 'సాక్షి' దినపత్రిక సంపాదకీయంపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ నడిచింది. ప్రతిపక్షాల నిరసన హక్కును అధికారపక్షం కాలరాస్తోందంటూ వాపోయిన సీఎల్పీ నేత జానా రెడ్డి.. సాక్షి ఎడిటోరియల్ ‘నిరసనల బహిష్కారం’ ఆర్టికల్‌ను స్పీకర్ మధుసూదనాచారికి చదివి వినిపించారు. బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ చాంబర్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. సభ జరుగుతోన్న తీరుపై ఫిర్యాదు చేశారు. ‘మీమీద మీకే ఫిర్యాదు చేయాల్సి రావడం ఒకింత బాధాకరమే అయినా తప్పడంలేదు. నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ అధికారపక్షం ఆ హక్కును కాలరాస్తోంది. పరిస్థితిలో మార్పు రాకుంటే సమావేశాలను బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోము’ అని స్పష్టం చేశారు.
ప్రశ్న, నిరసనల్లోనే ప్రజాస్వామ్యం : ‘నిరసనల బహిష్కారం’ శీర్షికతో ప్రచురితమైన సాక్షి ఎడిటోరియల్ ఆర్టికల్‌ను ప్రతిఒక్కరూ చదవాల్సిందిగా జానారెడ్డి అభ్యర్థించారు. ‘‘ప్రజాస్వామ్యం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో మాత్రమే ఉండదు. నిరసన వ్యక్తం చేయడానికి, నిలదీయడానికి సామాన్యులకు గల హక్కులో ఉంటుంది.. నిర్భీతిగా వ్యక్తం చేసే అభిప్రాయంలో ఉంటుంది. అధికార పీఠాలపై ఉన్నవారు చేస్తున్నది తప్పని చెప్పగల సాహసంలో ఉంటుంది..’’ అంటూ సాగే వ్యాసాన్ని చదివి వినిపించారు.
చదవండి.. సాక్షి ఎడిటోరియల్ ఆర్టికల్ : నిరసనల బహిష్కారం