రాష్ట్రానికి క్షేమం కాదు : భట్టి | Mallu Bhatti Vikramarka Slams TRS Government Over Telangana Budget | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి క్షేమం కాదు : భట్టి

Published Thu, Mar 12 2020 1:57 AM | Last Updated on Thu, Mar 12 2020 7:49 AM

Mallu Bhatti Vikramarka Slams TRS Government Over Telangana Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్‌ ఏమాత్రం క్షేమకరం కాదని, బడ్జెట్‌లో సామాజిక స్పృహ లోపించిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అభూత కల్పనలతో సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టి ప్రభుత్వం సభను, ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం అప్పులు, మద్యం విషయంలోనే బడ్జెట్‌లో అభి వృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది రాష్ట్ర ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో జరిగిన సాధారణ చర్చలో ఆయన ప్రసంగిం చారు. ప్రభుత్వం చూపిన ద్రవ్యలోటు రూ. 33 వేల కోట్లను పూడ్చుకొని మరో రూ. 30 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని రాబడితే కానీ బడ్జెట్‌ వాస్తవ రూపంలోకి రాదన్నారు. రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌లో ద్రవ్యలోటు, పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 63 వేల కోట్ల రాబడి ప్రశ్నార్థకం కానుందన్నారు.

మద్యం అమ్మకాలు నియంత్రించాలి...
గత బడ్జెట్‌లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఈసారి దానికి అదనంగా రూ. 16 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని భట్టి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలను తగ్గించాలని ప్రయత్నిస్తుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ‘తాగండి.. తాగండి.. తాగండి, అమ్మండి..అమ్మండి..అమ్మండి’ అనే రీతిలో వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే వెంటనే మద్యం అమ్మకాలను నియంత్రించాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని భట్టి డిమాండ్‌ చేశారు.

రాజీవ్‌ స్వగృహ ఇళ్లు అమ్మొద్దు...
పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 30 వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని భట్టి ప్రశ్నించారు. భూములు అమ్ముతారా? రాజీవ్‌ స్వగృహ ఆస్తులు అమ్ముతారా? దిల్‌ భూములు అమ్ముతారా... ఏ మార్గంలో పన్నేతర ఆదాయం వస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్లను అమ్మొద్దని, వాటిని పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల కింద కేటాయించాలని కోరారు. 2007–08లో ప్రభుత్వం వేలం వేసిన భూములను కొన్ని సంస్థలు కొని నిరర్ధకంగా వదిలివేశాయని, ఆ భూములను మళ్లీ తీసుకొని వాటిని ప్రస్తుత ధరల్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని సూచించారు.

పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో వివక్ష..
ప్రభుత్వం గత ఆరేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని భట్టి ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాల వల్ల ఐటీ రంగం అభివృద్ధి చెందిందే తప్ప ఇందులో టీఆర్‌ఎస్‌ సాధించిందేమీ లేదన్నారు. పరిశ్రమల స్థాపనలో సర్కారు వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వారికి, ప్రజాప్రతినిధులకు వాటాలున్న కంపెనీలకు ప్రత్యేక జీవోలిచ్చి ప్రోత్సాహకాలిస్తున్నారని, మిగిలిన మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పౌల్ట్రీ రంగంలో పెద్ద అవినీతి జరిగిందని, పౌల్ట్రీ రైతుకు సబ్సిడీపై ఇవ్వాల్సిన మొక్కజొన్నలను బడా కంపెనీలు గంపగుత్తగా టన్ను రూ. 18 వేలకు మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి రూ. 26 వేలకు బయట అమ్ముకుంటున్నాయని, దీనిపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని భట్టి డిమాండ్‌ చేశారు.

విద్యకు కేటాయింపులు పెంచాలి...
యూనివర్సిటీలకు కేటాయించిన మొత్తం జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోవని భట్టి అభిప్రాయపడ్డారు. పీహెచ్‌డీ విద్యార్థులు కేటరింగ్‌ పనులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 58.71 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కేవలం 5.14 శాతం అంటే 3.02 లక్షల మంది మాత్రమే చదువుకోగలుగుతున్నారని చెప్పారు. 46.82 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, విద్యకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని కోరారు.

ప్రాజెక్టుల నిర్మాణం ఎంత కాలం?
బడ్జెట్‌లో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు చూపినా వాటిని ఎలా ఖర్చు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలు కలపి రూ. 3.19 లక్షల కోట్లకు చేరాయని, బడ్జెట్‌లో రూ. 22 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలకే కట్టాల్సి వస్తోందని, భవిష్యత్‌లో అవి మోయలేని స్థితికి చేరుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తిరిగి చెల్లించే గడువు కూడా 40 ఏళ్లు పెట్టారని తెలుస్తోందని, దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. లక్షల కోట్లు చూపుతూ కేటాయింపులు మాత్రం ఈసారి రూ. 11 వేల కోట్లకే పరిమితం చేశారని, ఈ కేటాయింపులతో ప్రాజెక్టులు ఎన్నేళ్లు కడతారని భట్టి ప్రశ్నించారు. పదేపదే రుణాలు తీసుకునేందుకే ప్రభుత్వం ఇలా తక్కువ బడ్జెట్‌ కేటాయిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ స్థాయిలో అప్పులు చేయలేదన్నారు. మిషన్‌ భగీరథను పెద్ద ఫ్రాడ్‌గా అభివర్ణించిన భట్టి... గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు సంతకాలు చేయించుకొని వెళ్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలతో విభేదిస్తున్నానని, ప్రజలకిచ్చిన హామీలకు అనుగుణంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేలా బడ్జెట్‌ కేటాయింపులను సవరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఎంపీ పేరు చెప్పేటప్పుడు అనుమతి తీసుకున్నారా?
పౌల్ట్రీ రంగంపై భట్టి మాట్లాడుతున్న సమయంలో మార్క్‌ఫెడ్‌ నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు, వాటి యజమానుల పేర్లు చెబుతూ రంజిత్‌రెడ్డికి చెందిన రాజరాజేశ్వరి హేచరీస్‌ పేరును ప్రస్తావించారు. దీంతో కలగజేసుకున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... సభలో లేని వ్యక్తి పేరు ప్రస్తావించే ముందు స్పీకర్‌ అనుమతి తీసుకోవాలని, ఒకవేళ తీసుకోకపోతే రికార్డుల నుంచి ఆ పేరును తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రంజిత్‌రెడ్డి ఎంపీ అని తనకు ఇంతవరకు తెలియదని, కానీ తాను ఎంపీ అని సంబోధించలేదన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన అంశంపై భట్టి మాట్లాడుతుండగా ప్రభుత్వ విప్‌ సునీత కలగజేసుకొని సభ నుంచి భట్టిని సస్పెండ్‌ చేయలేదని కామెంట్‌ చేసి నాలుక కరుచుకున్నారు. మద్యం, యూనివర్సిటీలు, మిషన్‌ భగీరథపై భట్టి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలంటూ అధికార టీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement