
30% కమీషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారన్న కేటీఆర్.. 20% కమీషన్లంటూ సెక్రటేరియెట్‌లో కాంట్రాక్టర్ల ధర్నాలు జరిగాయని వ్యాఖ్య
దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక
రుజువైనా చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పాలంటూ సవాల్
మీలా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదంటూ ఫైర్
భట్టి వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ సభ్యుల నిరసన.. శాసనసభలో ఇరుపక్షాల ఆందోళనలు, నిరసనలు
30% కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమీషన్ అంటూ సచివాలయంలో ధర్నాలు జరుగుతున్నాయి
- కేటీఆర్
కేటీఆర్‌ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేదంటే ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.
-భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్‌ఎస్ సభ్యుడు కె.తారకరామారావు పేర్కొనడం, ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
మంత్రులు అడ్డుపడుతుండటంతో..
బడ్జెట్ పద్దులపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డుపడటంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ‘‘మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నారు. సంయమనం ఉండాలి. మేం కూడా రెచ్చగొట్టగలం. 30శాతం కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు.
20శాతం కమీషన్ అంటూ సచివాలయంలో (కాంట్రాక్టర్ల) ధర్నాలు అవుతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్‌ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేకుంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి’’అని సవాల్ చేశారు. గత ప్రభుత్వం పాపం వల్లే రూ.లక్ష కోట్ల పనులు చేసిన వారు బిల్లులు రాక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు.
ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ..
కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బాధ్యతతో రాజకీయాల్లో వచ్చాం. అడ్డగోలుగా మీలా రాష్ట్రం మీద పడి బరితెగించి దోపిడీ చేయడానికి రాలేదు. నాలాగా అణగారిన వర్గాలు, బాధితులు, పీడితులు, పేద కుటుంబాల కోసం ఏదో చేయాలని ఉన్నతమైన ఆశయంతో వచ్చిన వాళ్లం. మీలా ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పాడు చేసిపోయేందుకు రాలేదు.
మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదీ పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా?’’అని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ‘30శాతం కమీషన్..’అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు.
బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనతో..
కేటీఆర్‌ను ఉద్దేశించి ‘ఒళ్లు బలిసి’అంటూ భట్టి తప్పుడు మాటలు మాట్లాడరంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మళ్లీ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ దగ్గరికి దూసుకెళ్లారు. మొదట కేటీఆరే రెచ్చగొట్టారని, ఒకట్రెండు అన్‌పార్లమెంటరీ పదాలుంటే తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిరసన కొనసాగించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాత్రమే తాను సూచించానని భట్టి వివరణ ఇచ్చారు.
ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని చెప్పారు. బట్టలు విప్పి కొడతామంటూ సభలో సీఎం రేవంత్ అన్నప్పుడు లేని అభ్యంతరం తమ మాటలకు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ప్యానల్ స్పీకర్ ఆయన మైక్ కట్ చేసి బీజేపీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా ‘వద్దురా నాయనా.. ట్వంటీ పర్సెంట్ పాలన’అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు.
భట్టి దళితుడనే ఆరోపణలు: పొన్నం
దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత పదవి దక్కవద్దనే ఉద్దేశంతోనే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.