
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి స్పష్టీకరణ
ఆ 400 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు వినియోగిస్తాం
యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పిస్తాం
ఆ పరిసరాల్లో పర్యావరణానికి ముప్పు తెచ్చే చర్యలేవీ చేపట్టబోం
ఆ భూముల కోసం వైఎస్సార్ అలుపెరుగని పోరాటం చేశారు: భట్టి
టీడీపీ ప్రభుత్వం బిల్లీరావుకు భూమి ఇస్తే.. కాంగ్రెస్ సర్కార్ కాపాడింది
బీఆర్‌ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి
25వ సర్వే నంబర్ భూమికి కచ్చితమైన రికార్డులు లేవు: శ్రీధర్‌బాబు
చాలెంజ్ చేస్తున్నాం.. పర్యావరణం దెబ్బతింటోందని నిరూపిస్తారా?: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానిది (హెచ్‌సీయూ) కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆ భూమి వర్సిటీదే కానప్పుడు తీసుకుంటున్నామనడంలో వాస్తవం ఏముంటుందని ప్రశ్నించింది. ఈ భూముల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేసింది. ఈ భూమిని పరిశ్రమల స్థాపనకు వినియోగిస్తామని తెలిపింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పిస్తామని వెల్లడించింది. హెచ్‌సీయూకు చెందిన ఇంచ్ భూమిని కూడా తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.
పర్యావరణానికి ముప్పు తెచ్చే చర్యలు వర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం చేపట్టబోమని హామీ ఇచ్చింది. హెచ్‌సీయూ భూములను లాక్కునేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోందంటూ వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం, అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్‌ఎస్, బీజేపీ అసత్య ప్రచా రం చేస్తున్నాయని విమర్శించారు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వ అ«దీనంలోనే ఉందని చెప్పారు.
వర్సిటీకి భూమి ఇచ్చింది కాంగ్రెస్ సర్కారే: భట్టి
భూమి ఇచ్చి హెచ్‌సీయూను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి అన్నారు. ఇందులో 400 ఎకరాల భూమిని తెలుగుదేశం ప్రభుత్వం బిల్లీరావుకు చెందిన మోసపూరితమైన కంపెనీ ఐఎంజీ భారత్‌కు కట్టబెట్టిందని తెలిపారు. ఈ భూమి తీసుకున్నందుకు పరిహారంగా యూనివర్సిటీకి ఆనుకునే మరోచోట (గోపన్‌పల్లి వైపు) 397 ఎకరాలు ఇచ్చిందని చెప్పారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారుల మధ్య అప్పట్లోనే ఒప్పందం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006 నవంబర్ 21న ఐఎంజీ భారత్‌కు టీడీపీ ఇచ్చిన భూమిని రద్దు చేశారని తెలిపారు. దీంతో బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించారని, కానీ వైఎస్సార్ అలుపెరగని న్యాయ పోరాటంతో ప్రజల భూమిని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.
అయితే రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ళుగా ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రూ.కోట్ల విలువైన భూమిని గాలికొదిలి పరోక్షంగా ఫ్రాడ్ కంపెనీకి మేలు చేసిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి న్యాయ పోరాటం చేసి, విజయం సాధించామని, ప్రజల భూమిని ప్రజలకు చెందేలా చేశామని వివరించారు. ప్రస్తుతం ఈ భూమిని టీజీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. ఇందులో ప్రభుత్వంలోని ఏ ఒక్కరి స్వార్థం లేదని చెప్పారు. వర్సిటీ పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుంటే వాటికి తమ హయాంలోనే అనుమతులు ఇచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు..ఇప్పుడు పర్యావరణం దెబ్బతింటోందని మాట్లాడటంలో అర్థం లేదని విమర్శించారు. వారి రాజకీయ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు భట్టి విజ్ఞప్తి చేశారు.
ఆ ప్రచారంలో వాస్తవం లేదు: శ్రీధర్‌బాబు
కంచె గచ్చిబౌలిలోని 25వ సర్వే నంబర్‌లో ఉన్న భూమికి ఇప్పటివరకూ కచ్చితమైన రికార్డులు లేవని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 2016లో దీనిపై అప్పటి ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ 1,500 ఎకరాలపై యూనివర్సిటీకి హక్కులు కల్పించేందుకు కొన్ని సిఫారసులు చేసిందని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి విమర్శించారు. ఇటీవల తాము యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజి్రస్టార్‌తో సంప్రదింపులు జరిపామని, చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఆ 400 ఎకరాల భూమిలో చెరువులు, బండరాళ్లు దెబ్బతింటున్నాయని ఒక వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ఫెవికాల్ బంధంతో అసత్యాల ప్రచారం: పొంగులేటి
హెచ్‌సీయూ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటోందని నిరూపించగలరా? అని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేస్తామని, ఒక్క పక్షిగానీ, జంతువు గానీ చనిపోయిందని రుజువు చేయాలని విపక్షాలను డిమాండ్ చేశారు. రెండు ప్రతిపక్ష పార్టీలూ ఫెవికాల్ బంధంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా ఈ భూమి కోర్టు పరిధిలో ఉంటే పోరాటం చేయలేని బీఆర్‌ఎస్, పరోక్షంగా బిల్లీరావుకు సహకరించిందని ఆరోపించారు. ప్రజల భూమిని తాము కాపాడుతుంటే అబద్ధాలతో గందగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కృషిని చూసి విపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు మొదలు, దాని అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. వర్సిటీ భూమిలోంచి గత ప్రభుత్వం రోడ్డు వేయబోతుంటే హెచ్‌సీయూ వీసీ కోర్టును ఆశ్రయించారని, అప్పుడు ఈ భూమిపై వర్సిటీకి అధికారం లేదని అప్పటి ప్రభుత్వం చెప్పిందన్నారు. విద్యార్థుల మనోభావాలు ఏమాత్రం దెబ్బతిననివ్వబోమని చెప్పారు. విద్యార్థుల ముసుగులో అరాచకం చేయాలని చూసే శక్తులను ఏమాంత్రం ఉపేక్షింబోమని మంత్రి హెచ్చరించారు.